100 పడకల "మాతా శిశు ఆసుపత్రి"ని ప్రారంభించిన స్పీకర్ పోచారం
కామారెడ్డి సెప్టెంబర్ 3
బాన్సువాడ పట్టణంలో రూ. 17.80 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల "మాతా శిశు ఆసుపత్రి"ని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు.అనంతరం రూ. 9 కోట్ల ప్రత్యేక నిధులతో బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మించనున్న 100 అంగన్వాడీ భవనాల శిలాఫలకాలకు శంకుస్థాపన చేసారు. ఈసందర్భంగా జరిగిన సభలో స్పీకర్ గారు మాట్లాడుతూ...తల్లీ బిడ్డల సంక్షేమం కోసమే ఈ ఆసుపత్రి అని ఈరోజు నుంచి మాతా శిశు ఆసుపత్రిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతమైన బాన్సువాడతో పాటుగా చుట్టూ ఉన్న ప్రాంతాల ప్రజలకు ఈ ఆధునిక ఆసుపత్రి ఎంతో దగ్గరగా ఉండడంతో పాటుగా ఆధునిక వైద్య సదుపాయాలను అందిస్తుందన్నారు. రక్తం సరిపడా లేక డెలివరీ క్రిటికల్ అయి హైదరాబాద్ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపు గతంలో ఎంతోమంది ప్రాణాలు కొల్పోయారు. ఇకనుంచి అలాంటి పరిస్థితి ఉండదు. తల్లి బిడ్డకు కావలసిన అన్ని రకాల వైద్య సేవలు ఈ ఆసుపత్రిలో అందుతాయన్నారు.డెలివరీ సమయంలో ఇబ్బందులు లేకుండా రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.ఆక్సిజన్ ను తయారు చేసేలా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశాం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మంజూరు అయిందన్నారు.బాన్సువాడ కు రూ. 40 కోట్లతో కొత్తగా నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని చెప్పారు.రాష్ట్రంలో నర్సింగ్ కళాశాలలు హైదరాబాద్, సిరిసిల్ల మరియు బాన్సువాడ లో మాత్రమే ఉన్నాయన్నారు..1997 లో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 100 పడకలతో ఏరియా ఆసుపత్రి నిర్మించాం.అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణీలకు రవాణా సౌకర్యం కల్పించాం.అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. దీనితో సుఖ ప్రసవాలు బాగా పెరిగాయన్నారు.కేసీఆర్ కిట్ తో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య బాగా పెరిగింది.కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఆడబిడ్డకు పదమూడు వేల రూపాయలు, మగబిడ్డకు పన్నెండు వేల రూపాయలు అందిస్తున్నాము.గత ఏడాది రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మధినం సందర్భంగా 22 లక్షల స్వంత నిధులతో అంబులెన్స్ ను కొనుగోలు చేసి ఆసుపత్రికి ఇప్పించాము.ఆసుపత్రిలో వైద్యులు, నర్సులే దేవుళ్ళు. అందరూ వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.