YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తమిళనాడు అసెంబ్లీలో చిరు, పవన్ ప్రస్తావన

తమిళనాడు అసెంబ్లీలో చిరు, పవన్ ప్రస్తావన

తమిళనాడు అసెంబ్లీలో చిరు, పవన్ ప్రస్తావన
చెన్నై, సెప్టెంబర్ 3,
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పనితీరును ప్రశంసిస్తూ పవన్‌ కళ్యాణ్ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో నటుడు చిరంజీవి కూడా స్టాలిన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో పవన్ ట్వీట్, చిరు భేటీపై తమిళనాడు శాసనసభలో చర్చ జరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్‌ తన ప్రసంగంలో ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా పవన్‌ ట్వీట్‌ను తమిళ మంత్రి తెలుగులో చదివి వినిపించడం విశేషం. మిగతా సభ్యులకు అర్థమయ్యేలా ఈ ట్వీట్‌ను తెలుగులో చదువుతూ తమిళంలోకి అనువదించి చెప్పారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను నటుడు నిర్మాత బండ్ల గణేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి.. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు.. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం.. స్ఫూర్తిదాయకం.. మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని ట్వీట్‌లో పవన్‌ పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. గత బుధవారం నటుడు చిరంజీవి.. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. చెన్నైలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘స్టాలిన్‌ను కలవడం సంతోషంగా ఉంది.. ఆయన తీసుకున్న పలు ఉన్నతమైన నిర్ణయాలతో గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగారు.. కరోనా కాలంలో మెరుగైన పాలన అందిస్తున్నారని అభినందనలు తెలిపాను’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టాలిన్ తీసుకున్న పలు నిర్ణయాలకు ప్రతిపక్షం నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపక్షమే అన్న సిద్ధాంతాన్ని ఆయన పాటిస్తున్నారు. గతంలో అన్నాడీఎంకే మొదలుపెట్టిన సంక్షేమ పథకాలను అలాగే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అమ్మ క్యాంటీన్ల విషయంలో స్టాలిన్ తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు దక్కాయి.స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు వెంటనే అమ్మ క్యాంటీన్ల పేరు మార్పు లేదా వాటిని తొలగించడం చేస్తారని చాలామంది భావించారు. ఈ నేపథ్యంలో చైన్నైలోని అమ్మ క్యాంటీన్‌పై ఇద్దరు డీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. ఆహార పదార్థాలతోపాటు కూరగాయలను కూడా చెల్లాచెదురు చేశారు. వీరిని పార్టీ నుంచి బహిష్కరించిన సీఎం.. అమ్మ క్యాంటీన్లు కొనసాగించి. అందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని స్టాలిన్ ప్రకటించారు.

Related Posts