వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా
విజయవాడ, సెప్టెంబర్ 3,
చిత్తూరు జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా సంచలనంరేపింది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారనిపాకాల వాలంటీర్లు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లను వేధిస్తున్న ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార నేతలు వేధింపులు మానుకోవాలన్నారు. గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు.మొత్తం 74 మంది రాజీనామా చేస్తున్నామని వాలంటీర్లు తెలిపారు. ఈవో తమను అసభ్య పదజాలంతో దూషించారని, తమను మానసికంగా చాలా తీవ్ర ఇబ్బందులకు, మనోవేదనకు గురి చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటరీలపై స్థానిక రాజకీయ నేతలు పెత్తనాలు మానుకోవాలని.. అలాగే వారిని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల మూకమ్మడి రాజీనామా చర్చనీయాంశమైంది.