రాజమండ్రి, సెప్టెంబర్ 4,
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూట్ మార్చారు. మొదటి విడతలో ఓన్లీ తిరుమల మీదే దృష్టి పెట్టిన వైవీ రెండోదఫా ప్రత్యక్ష రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. రాజ్యసభకో లేక ఎమ్మెల్సీ అయ్యి రాష్ట్ర కేబినెట్‌లోకి వద్దాం అనుకున్న వైవీని.. మళ్లీ టీటీడీకే పంపారు సీఎం జగన్. దీంతో.. అటు స్వామి కార్యం.. ఇటు స్వకార్యం అన్నట్టు రెంటినీ నడపాలని డిసైడ్ అయ్యారట వైవీ.2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ ఛైర్మన్‌గా వైవీని నియమించారు. రెడ్డి సామాజికవర్గమే అయినా.. ఆయన ఆచార వ్యవహారాలు, దైవభక్తి విషయంలో జంధ్యం వేసుకొని బ్రాహ్మణుడిలా ఉంటాయని చెబుతారు. టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కొత్తలో వైవీకి క్రిస్టియన్ ముద్ర వేయడానికి చూశాయి విపక్షాలు. ఆ సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను, భక్తి, ఆచారాలు పాటించడంలో వైవీ తనను మించిన బ్రాహ్మణుడిగా కొనియాడారు. చిన్నప్పటి నుంచి వైవీని దగ్గర నుంచి చూడటం వల్లే సీఎం జగన్.. ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని అనుకున్నారు. మొదటి టర్మ్ పదవీకాలం పూర్తయినా.. తిరిగి రెండోసారి అదే పదవిలో ఆయన్ని కూర్చోబెట్టారని అభిప్రాయపడుతున్నారు పార్టీ నేతలు.టీటీడీ ఛైర్మన్‌గా మొదటి టర్మ్‌లో ఎక్కువగా తిరుమల శ్రీవారి సేవలోనే తన్మయం చెందారు వైవీ. ఆ సమయంలోనూ ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నప్పటికీ చుట్టం చూపుగా వచ్చి వెళ్లేవారు. టీటీడీ ఛైర్మన్‌గా రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చూశారు. అధిష్ఠానం మాత్రం టీటీడీ ఛైర్మన్‌గా రెండోసారీ ఆయనకే ఇచ్చింది. దీంతో అయిష్టంగానే మళ్లీ టీటీడీ ఛైర్మన్ పదవి చేపట్టారాయన. నామినేటెడ్ పదవిలో ఉంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోతామని అనుకున్నారో ఏమో.. సుబ్బారెడ్డి రూటు మార్చారు. ఇప్పుడు టీటీడీతోపాటు.. పార్టీ ఇంఛార్జ్‌గా ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఈ మధ్య తరచూ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం ఉన్నా వచ్చి పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల కరోనాతో చనిపోయిన నేతల ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. కొత్తగా కార్పొరేషన్ ఛైర్మన్‌లు అయిన వారి ప్రమాణస్వీకారోత్సవాలకు హాజరయ్యారు వైవీ.ఉభయగోదావరి జిల్లాల్లోని రాజమండ్రి, ఉండి నియోజకవర్గాలతోపాటు పలు ప్రాంతాల్లో వైసీపీలో నెలకొన్న వర్గ విభేదాలను పరిష్కరిస్తూ అందరినీ ఏకతాటిపైకి తెస్తున్నారు వైవీ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఆ పీఠంపై వైసీపీ కార్పొరేటర్‌ను కూర్చోబెట్టాలని చూస్తున్నారు. రానున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవశం చేసుకుని టీడీపీ కంచుకోటలో వైసీపీ జెండా ఎగరేయడానికి నేతలతో వ్యూహ రచన చేస్తున్నారు. రాజమండ్రిలోని వైసీపీ నేతలతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయంతో నడిపిస్తున్నారు వైవీ. ఈ విధంగా సుబ్బారెడ్డి పార్టీపై ఫోకస్ పెట్టడంతో కొందరు నేతలు పార్టీలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకొనే అవకాశం కలుగుతోందని సంబర పడుతున్నారట. అందుకే వైవీ సుబ్బారెడ్డి స్వామి కార్యంతోపాటు.. స్వకార్యంలోనూ బిజీ అయ్యారని చెవులు కొరుక్కుంటున్నాయి పార్టీ వర్గాలు.