తిరుపతి, సెప్టెంబర్ 4,
ఖాకీలకు కొన్ని పోలీస్ స్టేషన్లపై సెంటిమెంట్ ఎక్కువ. కలిసి వస్తుంది అనుకుంటే.. పోస్టింగ్‌ల కోసం ఓ రేంజ్‌లో పైరవీలు చేస్తారు. అదే రివర్స్‌లో ఉంటే పోలీస్ స్టేషన్ పేరు చెబితేనే హడలెత్తిపోతారు. ప్రస్తుతం ఆ PS గురించి అదే చర్చ జరుగుతోంది. మాకొద్దీ తలనొప్పి అని విసుగెత్తిపోతున్నారట అధికారులు. వైసీపీ, టీడీపీ మధ్యలో పోలీస్‌గా చర్చల్లో ఉన్న ఆ కథేంటో ఈ స్టోరీలో చూద్దాం.చిత్తూరు జిల్లా చంద్రగిరి. పోలీస్‌శాఖ పరంగా సమస్యాత్మక ప్రాంతం. అనేక సమస్యలు తిష్ట వేశాయి. ఎక్కడ అలజడి రేగిన ఇంఛార్జ్ అధికారులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. డీఎస్పీ కోసం ఎదురు చూడక తప్పడం లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత మండలంలోనే ఈ పీఎస్ ఉంది. ప్రస్తుతం అధికారులు లేక స్టేషన్ ఖాళీ.చంద్రగిరి మండల పరిధిలో రెండు జాతీయ రహదారులు, స్వర్ణముఖి, భీమా నదులు, రాయలవారి కోట, శ్రీనివాసమంగాపురం, శేషాచల అడవులు, శ్రీవారిమెట్టు ప్రాంతాలు ఉన్నాయి. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే వీఐపీల తాకిడి ఎక్కువ. పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారి 16 కిలోమీటర్లు చంద్రగిరిలో కలుస్తుంది. ఈ హైవేలో రోడ్డు ప్రమాదాలూ ఎక్కువే. తిరుపతి, మదనపల్లి జాతీయ రహదారి 15 కిలోమీటర్లు ఈ మండలంలోనే ఉంది. ఈ హైవేలోనే భాకరాపేట ఘాట్ రోడ్డ కూడా ఉంది. ఇసుక, గ్రావెల్, ఎర్రచందనం మాఫియాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆ పని ఒత్తిడికి తగ్గట్టు మెన్ ఉండటం లేదు. దీంతో పని ఒత్తిడికి అధికారులు అక్కడ పోస్టింగ్ అంటేనే భయపడే పరిస్థితి.చంద్రగిరి పిఎస్ పరిధిలోనే పొలిటికల్ పార్టీల సభలు, సమావేశాలు, ధర్నాలు, నిరసనలు, ఆందోళనలతో ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటుంది. మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉండేది ఈ పీఎస్ పరిధిలోనే. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య రాజకీయ గొడవలు కామన్. ఇవి పోలీస్ స్టేసన్‌కు చేరితే పోలీసులు చెప్పింది వినరు.. పైగా ఖాకీలకు వార్నింగ్‌లు వెళ్తుంటాయి. దీంతో అడకత్తెరలో పోక చక్కలా మారింది పోలీసుల పరిస్థితి. అటు చెప్తే వాళ్లకు కోపం.. ఇటు చెప్పతే వీళ్లకు కోపం అన్నట్టు అయ్యింది. దీంతో మాకొద్దు బాబు ఈ స్టేషన్ అంటున్నారట. సహజంగా హైవేల పరిధిలో ఉన్న స్టేషన్లలో పోస్టింగ్‌లకు బాగా గిరాకీ ఉంటుంది. కానీ ఇక్కడ హైవే ఉన్న.. పొలిటికల్ దెబ్బలకు పోలీసులు పారిపోతున్నారు.ఆ మధ్య జరిగిన పంచాయితీ ఎన్నికలే దీనికి నిదర్శనం. రాజకీయ గొడవలు పీక్‌కు వెళ్లడంతో 2 నెలలుగా ఎస్‌ఐలు లేరు. మెడికల్ లీవ్‌లో వెళ్లిన సీఐ తిరిగి రాలేదు. కేసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. బాధితులు వస్తే తిప్పి పంపేస్తున్నారు కానిస్టేబుళ్లు. పదిరోజుల క్రితం ఇంఛార్జ్‌గా వచ్చిన ఓ సిఐ శ్రీకాళహస్తిలో పోస్టింగ్ రావడంతో వెళ్లిపోయారు. మరో ఇంఛార్జ్ సీఐ ఉన్నా వీలు చూసుకుని విధులకు హాజరుకావడంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. కేసుల పరిష్కారానికి డీఎస్పీ కోసం రోజూ ఎదురుచూడాల్సిన పరిస్థితి. మరి.. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పొలిటికల్ కౌగిలి నుంచి ఎప్పుడు బయటపడుతుందో చూడాలి.