YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

2024 చక్రం తిప్పడమే లక్ష్యమా...

2024 చక్రం తిప్పడమే లక్ష్యమా...

హైదరాబాద్, సెప్టెంబర్ 4, 
సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావన్నది పొలిటికల్ సర్కిల్స్ లో తరచూ వినిపించే మాట… ప్రత్యర్థులు వాటిని అర్థం చేసుకునే లోపే ఆయన తన పని చక్కబెట్టుకోగల నేర్పరి. ఎంతో ముందుచూపుతో ఆయన వ్యూహాలు ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా తనకు ఏమాత్రం ఫరక్ రాకుండా చూసుకోవడం కేసీఆర్ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన రచించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. తెలంగాణ ప్రజలందరీలో ఉద్యమ కాంక్షను రగిలింపజేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేలా చేశారు. కేవలం ఇద్దరు ఎంపీల బలంతో నాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారంటే ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను ప్రవేశపెట్టారు. తెలంగాణకు నీళ్లు, నిధులు రాబట్టడంలో పూర్తిగా విజయవంతం అయ్యారు. అయితే కేసీఆర్ ఐదేళ్ల పాలన పూర్తికాక ముందు ముందస్తు ఎన్నికల వెళ్లడం కేసీఆర్ వ్యూహాంగానే కన్పిస్తుంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వాళ్లే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని లేకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కేసీఆర్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే కొన్నివర్గాల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ మూడోసారి అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి ఉంది. రేపటి రోజున తెలంగాణలో అధికారం వచ్చినా రాకపోయినా తనకు ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.కేసీఆర్ కు తొలి నుంచి జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉంది. పలుమార్లు ఈ విషయాన్ని ఆయన మీడియా ముఖంగా కూడా ప్రస్తావించారు. గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేశారు. అయితే అది సాధ్యపడలేదు. అయినప్పటికీ ఆయన మనస్సులో మాత్రం జాతీయ రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ తాజాగా ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేయడం వెనుక దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పార్టీ యాక్టివిటీస్ ను విస్తరించడం లక్ష్యంగా కేసీఆర్ టీఆర్ఎస్ భవనానికి శంకుస్థాపన చేసినట్లు కన్పిస్తుంది. ఢిల్లీలో ప్రస్తుతం కేవలం జాతీయ పార్టీలకు మాత్రమే భవనాలున్నాయి. ప్రాంతీయ పార్టీలకు అధికారిక భవనాలున్నా వసతులు విషయంలో చాలా ఇబ్బందులున్నాయి. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తమకంటూ ఢిల్లీలో ఓ కార్యాలయం ఉంటే చాలా ఉపయోగంగా ఉంటుందని కేసీఆర్ భావించారు. అనుకున్నది తాడవుగా కేంద్రంతో సంప్రదింపులు చేసి ఢిల్లీలో స్థలాన్ని సాధించి టీఆర్ఎస్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన కూడా చేసేశారు.దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, ఏఐడీఎంకే, తెలుగుదేశం, వైసీపీ వంటి పెద్ద పార్టీలేవీ ఇంతవరకూ ఢిల్లీలో సొంత ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయాయి. ఒక స్థలం సమకూర్చుకుని సొంత భవనాలు నిర్మించుకోవాలనే ఆలోచన వాటికి ఏమాత్రం రాలేదు. ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాలకు చెందిన అధికార భవనాలనే ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతిపక్షంగా ఉండే వాటికి కనీస వసతి కూడా ఉండదు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఏదో ఒక హోదా ఉండాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో నాలుగైదు రోజులు మకాం వేసి జాతీయ సమస్యలపై చర్చించాలంటే మాత్రం ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందులు తప్పవు. జాతీయ స్థాయిలో తాను మూడో పక్షంగా ఎదగాలంటే ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పాల్సి ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ భవన కార్యాలయాన్ని అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.కేంద్రంలో క్రమంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుండటంతో 2024 నాటికి ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. రేపు కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే అనే టాక్ విన్పిస్తుంది. ఈ పరిస్థితి కేసీఆర్ వంటి మాటకారికి, అనుభవశాలికి సువర్ణావకాశమే అని చెప్పొచ్చు. రేపటి రోజున కాలం కలిసి వస్తే రాష్ట్రం లో పగ్గాలు తర్వాతి తరానికి అందచేసి ఆయన ఢిల్లీలో మకాం వేసే ఆలోచన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముందస్తు వ్యూహాంతో కేసీఆర్ హస్తినను వేదికగా మలిచాడని.. అందుకే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వేదికగా వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ పనులు కూడా చకచక జరుగుతుండటంతో త్వరలోనే హస్తినలో టీఆర్ఎస్ కార్యాలయ భవనం అందుబాటులోకి రావడం ఖాయం కన్పిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంత ముందుగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఎవరికీ అర్థం కాకుండా ఉన్నాయి. ఏదిఏమైనా కేసీఆర్ వ్యూహాలకు తిరుగు ఉండదని తాజా సంఘటన ద్వారా మరోసారి రుజువైంది.

Related Posts