YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ కు సహాయనిరాకరణ...?

రేవంత్ కు సహాయనిరాకరణ...?

హైదరాబాద్, సెప్టెంబర్ 4, 
తెలంగాణ కాంగ్రెస్ కు మూలస్తంభాలుగా ఉన్న నేతల్లో.. జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుత టీ కాంగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంత కాదనుకున్నా.. వీళ్లందరినీ కలుపుకొని వెళ్తే తప్ప.. పార్టీని ముందుకు తీసుకువెళ్లలేరు. వీళ్లు మాత్రమే కాదు.. రెండో వరసలో.. షబ్బీర్ అలీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలను కూడా రేవంత్ సమన్వయం చేసుకోవాల్సిందే. లేదంటే.. అధికారం అన్న ఆకాంక్షను ఆయన చేరుకోవడం చాలా కష్టం అవుతుంది.ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కానీ.. ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే.. ఓ కీలకమైన విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాకముందునుంటే జానారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమారుడిని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. పొన్నాల లక్ష్మయ్య సైతం ఎక్కువగా మీడియా ముందుకు కూడా రావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ చీఫ్ గా రాజీనామా చేసిన నాటినుంచే సైడ్ అయిపోయారు.కోమటిరెడ్డి బ్రదర్స్ – రేవంత్ రెడ్డి రిలేషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. న్యూట్రల్ గా ముందుకు పోతున్నారు. కలిసినప్పుడు కావలించుకోవడం తప్ప.. ఇప్పటివరకూ రేవంత్ కు అండగా మేమున్నామంటూ.. ధైర్యంగా షబ్బీర్, పొన్నం వంటి నేతలు చెప్పిన సందర్భాలు లేవు. కేవలం.. సీతక్క, మధు యాష్కీ, సంపత్, అద్దంకి దయాకర్ వంటి నేతలు తప్ప రేవంత్ పోరాటానికి మద్దతుగా ముందు నిలుస్తున్న నేతలైతే కనిపించడం లేదు.ఇదంతా చూస్తుంటే.. సీనియర్స్ టీమ్ అంతా సహాయ నిరాకణ చేస్తోందా.. అన్న అనుమానాన్ని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ చతుర్ముఖ పోటీలో.. కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తే కనీసం 30 నుంచి 40 సీట్లైనా గెలుచుకోవచ్చని పార్టీ కార్యకర్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. కాంగ్రెస్సే కింగ్ మేకర్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో.. సీనియర్లు ఇలా నాయకత్వానికి దూరంగా ఉంటుండడం.. అంత మంచిది కాదేమో అని ఆందోళన చెందుతున్నారు. రేవంత్ కూడా.. అందరినీ మరోసారి కలుపుకొనిపోయే ప్రయత్నం చేయాలని.. ఈ విషయాన్ని పార్టీ హై కమాండ్ సైతం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని.. పార్టీ శ్రేణులు ఓపెన్ గానే ఒపీనియన్ చెబుతున్నారు. మరి.. వారు ఆశించిన మార్పు కనిపిస్తుందా? చూద్దాం.

Related Posts