కరీంనగర్, సెప్టెంబర్ 4,
కాంగ్రెస్ రాజకీయమే అంత. ముఖ్యంగా హైకమాండ్ పాలిటిక్స్. దేన్నీ అంత తొందరగా తేల్చదు. అంతా నీదే అంటుంది..కానీ ఆ మాట నేతలందరితో అంటుంది. అదే కాంగ్రెస్ స్పెషాలిటీ. ఎవరి మాట తీసేయదు..అలాగే ఎవరికీ పెద్ద పీఠ వేసి కూర్చోపెట్టదు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం అంటేనే అది.ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ అదే జరుగుతోంది. ఈ నెలలోనే ఉప ఎన్నికలు తప్పేలా లేవు. టీఆర్‌ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీకి ఈటల రాజేందర్ ఉండనే ఉన్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్. రెండు మూడు పేర్లు తెరమీదకొచ్చాయి. కానీ కొండా సురేఖ ఫైనల్ అన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి. గాంధీభవన్ వర్గాలు కూడా ఈ వార్తలను కొట్టిపారేయలేదు. రేవంత్ కూడా సురేఖ వైపే ఉన్నారన్నారు. కానీ ఉన్నట్టుండి సీన్ రివర్స్ ఎందుకయింది. రేవంత్ స్పీడ్‌కు సీనియర్లు బ్రేకేసే ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? అందుకు హుజూరాబాద్‌ను ఎంచుకున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇదిలావుంటే, హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికపై సోమవారం కాంగ్రెస్ లో నాలుగు గంటలపాటు మేథో మథనం జరిగింది. చివరకు తేల్చింది ఏమిటంటే ఈ విషయంలో సీనియర్ల అభిప్రాయాలను తీసుకుని దీనిపై ఓ విస్తృత అవగాహనకు రావాలని నిర్ణయించారు. తెలంగాణ AICC ఇంచార్జ్ మాణికం ఠాగోర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. సీఎల్పీ లీడర్ భట్టివిక్రమార్క, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో పాటు కీలకమైన స్థానిక నాయకులతో కలిసి సెప్టెంబర్ 10లోగా నివేదికతో రావాలని నిర్ణయించారు. స్థానిక నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఈ నెల పదిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోతోంది.పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం హుజూరాబాద్‌లో కొండా సురేఖ పేరు ఫైనల్ అయింది. కానీ ఆ ప్రాంతంపై పట్టున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వంటి సీనియర్ నేతలు ఆమె అభ్యర్థిత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం వారికి నచ్చలేదు. అందుకే సీనియర్లను పిలిచి మాట్లాడింది హైకమాండ్. ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన ఓ నివేదికను మాణికం సర్కార్ హైకమాండ్‌కు నివేదించిన విషయం తెలిసిందే.కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిణామాలపై అనేక అనుమానాలకు తావిస్తోంది. సీనియర్లను చిన్నబుచ్చ కూడదనే ఈ డ్రామానా? ఇప్పుడిప్పుడే పార్టీ పేరు మళ్ల జనం నోళ్లలో వినిపిస్తోంది. కాంగ్రెస్‌కు మంచిరోజులు వచ్చాయన్న టాక్ వినిపిస్తోంది. ఈ స్థితిలో రేవంత్‌కు అంత సీన్ లేదని ప్రజలకు అర్థమైతే మొదటికే మోసం. కథ మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే సీనియర్లు కూడా ఖుష్ అయ్యేలా ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.మరోవైపు ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోందని టాక్. హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాతే అభ్యర్థిని ప్రకటించాలనే ప్లాన్‌తో ఉందని పార్టీ నాయకులు కొందరు అంటున్నారు. అందుకే ఇలా జాప్యం చేస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.ఇది ఇలావుంటే, హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోటీ చేయాలనుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆహ్వానించింది. ఈ ప్రకటనకు మంచి స్పందనే వస్తోంది. ఇప్పటికే పలువురు నాయకులు అప్లయ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఐదు వేల రూపాయల డీడీ తీసి జిల్లా కార్యాలయానికి పంపాలి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, హైదరాబాద్ పేరుతో ఈ డీడీ తీసి, బయోడేటా, పాస్ పోర్టు సైజ్ ఫొటో జత చేసిన ఫామ్‌ని ఈ నెల 5వ తేదీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలి. ఇలా ఆశావహుల అప్లికేషన్లను పీసీసీ చీప్ఫ్ రేవంత్‌రెడ్డి పరిశీలించి ఈనెల 10 తర్వాత అభ్యర్థి పేరు ప్రకటిస్తారు. కాంగ్రెస్ తాజా వ్యూహం ఇటు పార్టీ క్యాడర్‌ని …అటు పబ్లిక్‌నీ గందరగోళంలో పడేసింది. అభ్యర్థి విషయంలో ఇంత హడావిడి ఎందుకన్నది అంతుపట్టటం లేదు. కానీ ఇంకా ఆలస్యం చేస్తే మాత్రం కాంగ్రెస్‌లో లుకలుకలు దానిని మళ్లీ రచ్చకీడుస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు.