వరంగల్, సెప్టెంబర్ 4,
రామప్పపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శిస్తోంది. కాకతీయుల అద్భుత కట్టడానికి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కినా నిర్లక్ష్యపు నీడలు మాత్రం తొలగడం లేదు. ఆలయ అభివృద్ధి, కట్టడాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పైసా విదిల్చలేదు. యునెస్కో గుర్తింపు దక్కగానే క్రెడిట్ కోసం పోటాపోటీగా సంబురాలు నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత చేయాల్సిన ప్రక్రియను మాత్రం గాలికి వదిలేశాయి. జూలై 25న రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కింది. 40 రోజులు పూర్తవుతోంది.ఈ నెలలో రామప్ప ఆలయాన్ని సందర్శిస్తామని యునెస్కో ప్రతినిధులు నెలక్రితమే ప్రకటించారు. ఆలోగా ఆలయ పరిసరాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడంతో పాటు రామప్పకు సమీపంలోని ఆలయాల గుర్తింపు, చేయాల్సిన అభివృద్ధిపై క్లియర్ రూట్ మ్యాప్‌ను చేపట్టాలని సూచించారు. అయితే ప్రభుత్వం మాత్రం స్తబ్దుగా ఉంటోంది. నెలన్నర దాటుతున్నా రామప్ప అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సంబురాల సమయంలో వందల కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. ప్రకటనైతే చేశారు గానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా రాలేదని పురావస్తుశాఖ, టూరిజం శాఖ ఉన్నతాధికారుల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి రామప్ప ఆలయం, పరిసరాల అభివృద్ధి అనేది దాదాపు ఏడెనిమిది శాఖల సమన్వయంతో జరగాల్సి ఉంది. రామప్ప ఆలయం గర్భగుడి ఎండోమెంట్ శాఖ పరిధిలో ఉండగా, ఆలయ కట్టడాలు, ఆవరణ పురావస్తు శాఖ పరిధిలో ఉంది. ఆలయ పరిసరాల్లో కొంత భూమి టూరిజం శాఖ పరిధిలో ఉంది. అభివృద్ధి పనుల్లో ఉద్యానవనశాఖ కూడా మిళితమై ఉంది. రామప్పను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనుల కోసం రెవెన్యూ శాఖ భూసేకరణ జరగాల్సి ఉంది. అలాగే ఫారెస్ట్ శాఖల నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇరిగేషన్ శాఖ నుంచి కూడా కొన్ని అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఇన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి ప్రక్రియ ముందుకు సాగాల్సి ఉంటుంది.పాలంపేట డెవలప్‌మెంట్ ఆఫ్ అథారిటీ విషయం అటకెక్కింది. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ పాలంపేట చుట్టు పక్కల అభివృద్ధి పనులు చేపట్టేందుకు గాను పాలంపేట డెవలప్‌మెంట్ ఆఫ్ అథారిటీని ఏర్పాటు చేస్తామని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇప్పటి వరకు అటవైపుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వందలకోట్ల అభివృద్ధి పనులు చేస్తామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇటీవల యునెస్కో ప్రకటన తర్వాత రామప్ప వేదికగా ప్రకటించారు. అయితే మంత్రి ప్రకటన తర్వాత ఇప్పటి వరకు ఒక్క అంశంపైన కూడా ముందడుగు పడకపోవడం గమనార్హం.సింగరేణి ఓపెన్ కాస్టులు చేపడితే రామప్ప ఆలయానికి ముప్పు వాటిల్లుతుందని యునెస్కో సహా, పురావస్తు శాఖ అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే మేం ఓపెన్ కాస్టు చేపట్టబోమంటూనే వెంకటాపూర్ మండలంలో ప్రీమియర్ సర్వే చేపడుతుండటం గమనార్హం. శాశ్వతంగా ఓపెన్ కాస్టులు చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి 50కిలోమీటర్ల దూరంను ప్రామాణికంగా తీసుకున్న భూపాలపల్లిలోని గనులు, పాలంపేటకు 25కిలోమీటర్ల కన్నా తక్కువ దూరంలో నెలకొన్న విషయాన్ని రామప్ప పరిరక్షణ సమితి సభ్యులు గుర్తు చేస్తున్నారు. రామప్పకు భవిష్యత్‌లో ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాపరమైన నిర్ణయాల్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు