విజయవాడ
ఆదమరిచి నిద్రిస్తున్న జనసైనికునిపై కర్రలతో దాడి జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానులు గురువారం రాత్రి జనసేన పార్టీ అధినేత పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా అనాసాగరం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కట్ అవుట్ ఏర్పాటుచేసారు. పుట్టినరోజు వేడుకల అనంతరం కటౌట్ ప్రక్కన పాములపాటి గోపి అనే జన సైనికుడు నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో స్కూటీపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు కర్రలతో గోపీని చితకబాదారు. జరిగిన సంఘటనపై జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ తోట మురళీకృష్ణ విచారం వ్యక్తం చేసారు. తోట మురళీకృష్ణ మాట్లాడుతూ జనసేన కార్యకర్త పాములపాడు గోపి పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. కడప పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాలు అనాసాగరం వరకు తీసుకు వచ్చారు. రాష్ట్రాన్ని ఏదో చేద్దాం అని చెప్పి రౌడీయిజం చేస్తున్నారు. నిద్రపోతున్న కార్యకర్తపై దాడి చేయడం హేయమైన చర్య. పాములపాడు గోపి పై దాడి చేసిన విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. జరిగిన దాడిపై కృష్ణా జిల్లా ఎస్పీ తో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. త్వరలో అనాసాగరం రానున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. గాయపడిన గోపికి జనసేన అండగా ఉంటుంది. జరిగిన సంఘటనపై వెంటనే పోలీసులు కేసు నమోదుచేసి నిందితులను అరెస్టు చేయాలి. అలా కాని పక్షంలో ఉద్యమం చేపట్టి ఉదృతం చేస్తామని అన్నారు.