YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

టీచర్ల కొరత తీరేనా..

టీచర్ల కొరత తీరేనా..

త్వరలో నిరుద్యోగులకు శుభవార్త వెలువడనుంది. ఉపాధ్యాయ కొలువులు మినహాయిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఏ రంగంలోనూ త్వరగా భర్తీ చేయడం లేదు. అరకొరగా గ్రూపు పరీక్షల్లో పాల్గొంటున్నారు. బీఈడీ, డీఎడ్‌ కోర్సులు పూర్తిచేసుకుని వేల సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు. వీరందరు డీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అదృష్టవశాత్తు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో గత ఐదేళ్ల నుంచి విద్యార్థుల సంఖ్యను పెంచుతున్నారు. విద్యాశాధికారులు కృషి ఫలితంగా ఉపాధ్యాయ కొలువులు పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. వాస్తవానికి విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల హాజరుకు తగ్గట్టుగా ఉపాధ్యాయుల భర్తీ జరగటం లేదు. ఇప్పటికే పక్క జిల్లాలో కొన్ని కొలువులు మిగిలాయి. వాటిని మన జిల్లాకు బదిలీ చేసుకోవడానికి విద్యా శాఖను కోరారు. అందుకు ఆర్థిక శాఖ జిల్లా అధికారులను కొన్ని ప్రశ్నలు వేయగా.....వాటికి తగిన రీతిలో సమాధానాలు సిద్ధం చేశారు. ఏదేమైనా రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక కొలువులు కర్నూలు జిల్లాకు వచ్చే సూచనలు ఉన్నాయని విద్యాధికారులు విశ్వసిస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 2,940 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులకు 15,136 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ప్రతి 40 మందికి ఒకరు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 35 మందికి ఒకరు, ఉన్నత పాఠశాలలో 30 మందికి ఒక గురువు చొప్పున నియామకం జరపాలి. ఈ విధానాన్ని గత విద్యాధికారులు పాటించలేదు. వీరి నిర్లక్ష్యం కారణంగా     కొలువులు మరుగుపడ్డాయి. వాస్తవానికి గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు పెరుగుతున్నా గురువులు మాత్రమే తగ్గిపోతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం 2,500 నుంచి 3,480 వరకు కొలువులు అవసరంగా కనిపిస్తుంది.

ప్రతి ఏడాది పదవీ విరమణ పొందుతున్న స్థానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ ఏడాదిలో ఏవిధంగానైనా జంబో డీఎస్సీ ప్రకటించాలని పట్టుదలతో ఉంది. అందుకు జిల్లా నుంచి ఖాళీల స్థానాలు, విద్యార్థుల సంఖ్యను ఆధారంగా అవసరమైన కొలువులు ఎన్ని కావాలని విద్యాశాఖ కోరింది. వీరి ఆదేశాల మేరకు విద్యాశాఖధికారిణి తహెరాసుల్తానా ఆధ్వర్యంలో సిబ్బంది మూడు నివేదికలు రూపొందించి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. అందులో మొదట 2014 నుంచి 2017 అక్టోబరు నాటికి పదవీ విరమణ పొందనున్నవారు 588 ఖాళీలు...రెండో విడతలో 2018 మార్చి వరకు 611 కొలువులు...చివరగా విద్యార్థుల హాజరును దృష్టిలో పెట్టుకుని ఇంకా 1244 ఎస్జీటీ కొలువులు అవసమరని విద్యాశాఖధికారులు ప్రతిపాదనలు పంపారు. వీటితోపాటుగా పాఠశాల సహాయకులు, పీఈటీ, ఎల్‌పీ పోస్టులు, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ కొలువులు ఉన్నాయి.

ఇంతవరకు డీఎస్సీ విషయంలో జిల్లాకు పరిమితమైన కొలువులు కేటాయిస్తున్నారు. దీనిని భర్తీ చేయడానికి విద్యాశాఖ కృషి చేస్తోంది. విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్న పక్క జిల్లాల నుంచి కొలువులను బదిలీ చేసుకోవాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈవిధంగా చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల నుంచి ఎస్జీటీ పోస్టులు బదలాయించే అవకాశం కన్పిస్తోంది. అందుకు కొలువుల అవసరం చూపించాలని వారం క్రితం విద్యాశాఖ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు చెందిన ఐదేళ్ల జాబితాను రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో తక్కువ పాఠశాలలు....అత్యధికంగా విద్యార్థుల సంఖ్య జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం గర్వకారణం. రాబోయే డీఎస్సీలో అధిక పోస్టులు జిల్లాకు వస్తాయని చెబుతున్నారు. గతేడాది బదిలీల్లో స్థానాలు లేక డీఈవో ఫూల్‌లో ఉన్నవారు, 70 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేసి మిగిలిన స్థానాలు డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. పక్క జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పోస్టులను జిల్లాకు బదలాయించడానికి సానుకూలంగా స్పందిస్తే వందల సంఖ్యలో కొలువులు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధికారులు పంపిన మూడు జాబితాల్లో దేనికి మార్కు వేయనున్నారో త్వరలో తెలియనుంది.

గతంలో డీఈవోగా పనిచేసిన కె.రవీంద్రనాథ్‌ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కృషి చేశారు. ఆయన జిల్లాలో తక్కువ కాలం విధులు నిర్వహించినా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మార్గం సుగమం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో ఉపాధ్యాయ కొలువులు పెరగటం లేదని విద్యాశాఖకు నివేదికలు పంపారు. జిల్లాలో ఏకోపాధ్యాయులతో పాఠశాలలు నెట్టుకురావాల్సి వస్తోందని ఉన్నతాధికారులకు నివేదించడం ద్వారా 2016-17లో 1393 ఎస్జీటీ పోస్టులు అవసరమని గుర్తించారు. ఉపాధ్యాయుల ఖాళీలను గత డీఈవోలు పట్టించుకోకపోవడం వల్లనే భర్తీకి నోచుకోలేదు. పదేళ్ల క్రితం విద్యాశాఖకు సంబంధం లేకుండా సర్వశిక్ష అభియాన్‌ సంస్థ నివేదికల ద్వారా డీఎస్సీ పోస్టులు భర్తీ చేసేవారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలో చిన్నారుల హాజరు పెరగటాన్ని ప్రస్తావించకపోవడం విడ్డూరం. ప్రస్తుతం ఎస్జీటీ, పాఠశాల సహాయకులు మొత్తంగా 2,457 పోస్టులు అవసరమని గుర్తించినట్లు తెలిసింది. అందులో పదవీ విరమణ పొందిన ఎస్జీటీ పోస్టులతో పాటుగా ఉన్నత పాఠశాలల్లో 419, పీఈటీ-96, భాషాపండితులు-110 కొలువులు అవసరం ఉంది.

Related Posts