కొత్త ఐపీఎస్ ఆఫీసర్లు ఇవ్వండి
అమిత్ షాకు కేసీఆర్ వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4,
తెలంగాణ రాష్ట్రానికి ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఇవాళ సీఎం కేసీఆర్ కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వినతులు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండేళ్ల తర్వాత జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిందని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీజోన్లు ఏర్పడ్డాయని, దానికి తగినట్లే పోలీసు శాఖలోనూ మార్పులు జరిగాయన్నారు. అయితే పోలీసు శాఖలో ఐపీఎస్ ఆఫీసర్ల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. పోలీసు శాఖలో జరిగిన మార్పుల వల్ల సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 75 నుంచి 105కు పెరిగిందని, ఇక ఐపీఎస్ కేడర్ పోస్టుల సంఖ్య కూడా 139 నుంచి 195కు పెరిగాయని సీఎం కేసీఆర్ ఓ లేఖలో కేంద్ర హోంశాఖ మంత్రికి తెలిపారు.ఈ నేపథ్యంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు, పరిపాలనా నిర్వహణకు అనుగుణమైన రీతిలో ఐపీఎస్‌ల సంఖ్యను పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. పోలీసు ఆఫీసర్లకు సంబంధించిన అంశాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేశానని, కొత్త కమిషనర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఐజీపీల అవసరం ఉందని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అవసరాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి, ఐపీఎస్ క్యాడర్ సమీక్ష నిర్వహించాలని, తద్వారా అవసరమైన ఆఫీసర్లను కేటాయించాలని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు.45 నిమిషాల పాటు వివిధ అంశాలపై కీలకంగా చర్చించారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జల్‌శక్తి మంత్రి షెకావత్‌ను కలువనున్నారు. అమిత్ షాతో ఈ మధ్యాహ్నం 3 గంటలకు భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ సమావేశంలో అమిత్‌షాతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించనున్నారు.కాగా, సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రధాని మోదీని కలిసి యాదాద్రి దేవస్థానం పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు వెయ్యి కోట్లివ్వాలని, ప్రత్యేక గిరిజన వర్సిటీని నెలకొల్పాలని, కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు జవహర్ నవోదయ స్కూళ్లు మంజూరు చేయాలని, రెండు పారిశ్రామికవాడలను మంజూరుచేయాలని, పీఎంజీఎస్‌వై కింద అదనపు నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రధానికి వినతి పత్రాలు సమర్పించారు. అలాగే, ఐపిఎస్ క్యాడర్ రివ్యూ, హైదరాబాద్- నాగపూర్ పారిశ్రామిక కారిడార్, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజనకు అదనపు నిధులు.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం.. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం.. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి.. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటుపై లేఖలు అందజేశారు సీఎం కేసీఆర్.