YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఇంటికలకు కష్టాలు

 ఇంటికలకు కష్టాలు

అందరికీ ఇళ్లు అందుతాయని పేదలు ఆశగా అడుగులు వేస్తే అడుగడుగునా కష్టాలు పలకరిస్తున్నాయి. జిల్లాలో అందరికీ గృహాలు పథకం కింద తొలివిడతగా భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం పట్టణాలను ఎంపిక చేశారు. ఈ మూడుచోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో జ్లీపస్‌ త్రీ విధానంలో మొత్తంగా 20,512 ఇళ్ల బహుళ అంతస్థుల భవన నిర్మాణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. మూడు కేటగిరిల్లో నిర్మించే ఈ ఇళ్లకు రూ.3 లక్షల వరకు పూర్తి రాయితీగా భరించనుంది. మిగిలిన సొమ్ముకు సంబంధించి కొంత బ్యాంకు రుణం అందిస్తుంది. మరికొంత లబ్ధిదారుడు వాటాగా భరించాలి. మూడు పట్టణాల్లోనూ ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మాణాలను వేగవంతం చేసింది. ఈ గృహాలకు అర్హులైన పేద, మధ్య తరగతి వర్గాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేసింది. వీరి వాటా సొమ్మును చెల్లించమని చెప్పడంతో ఆయా పురపాలక సంఘాలకు డీడీల ద్వారా రూ.500, రూ.12,500, రూ.25 వేలు చొప్పున ఇంటి కేటగిరిని బట్టి అందించారు. ఆ సొమ్ములు చెల్లించేందుకు సగంమంది లబ్ధిదారులు అప్పులు చేశారు. ఇప్పుడు దాదాపు నాలుగు నెలలు గడిచింది.

రెండో విడత వాటా సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు ఈ సమయంలో గుండెల్లో బండరాయి పడినట్లయింది. లబ్ధిదారుల్లో కొందరు అనర్హులంటూ ఆయా పురపాలక సంఘాలకు జాబితాలు వచ్చాయి. వీటిని చూసిన స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు కంగుతిన్నారు. పాలకొల్లులో 3 వేల మంది, భీమవరంలో 1,700 మంది, తాడేపల్లిగూడెంలో రెండు వేల మంది మొత్తంగా 6,700 మంది అనర్హులని తేల్చారు. అంటే 40 శాతం పోయినట్లే. మొదటి వాయిదా సొమ్ము చెల్లించిన తర్వాత అనర్హుల జాబితా ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు సాధికారిక సర్వేలో పేరు అనుసంధానం జరిగిందోలేదోననే పరిశీలన ప్రక్రియ నడిచింది. తాజాగా అర్హులైన లబ్ధిదారులకు పాన్‌కార్డు అవసరమనే కొత్త సమస్యను తీసుకురావడంతో ఇప్పుడు అందరూ దీన్ని పొందేందుకు పరుగులెడుతున్నారు. అనర్హుల జాబితాలో పేరున్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

అనర్హులని తేల్చిన జాబితా చూస్తే చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన అనేక మందిని అనర్హులుగా చూపారు. ప్రధానంగా రోజువారీ పనిచేసుకునే వారు సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు కావడం గమనార్హం. పాలకొల్లు పురపాలక సంఘంలో అనర్హులుగా తేల్చిన మూడు వేల మంది జాబితాను ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఎటువంటి సొంతిల్లు, చిన్నపాటి స్థలంలేని అనేక మందికి ఇల్లు ఉన్నట్లుగా, ఇంటి పన్ను సైతం చెల్లిస్తున్నట్లు నమోదు చేశారు. రోజువారీ కూలీపని చేసుకునే పేద కుటుంబానికి చెందిన మహిళలకు నాలుగు చక్రాల కార్లు, భవంతులు ఉన్నట్లు చూపారు. అందరికీ గృహ పథకంలో సంవత్సర ఆదాయం రూ.3 లక్షలలోపు గల వారు అర్హులు. ఇక్కడ మాత్రం ఉద్యోగ భద్రతలేని, తక్కువ జీతంతో పనిచేసే ఒప్పంద కార్మికులు, ఔట్‌సోర్సింగ్‌, హోంగార్డులు, అంగన్‌వాడీ కార్మికులు, ఆశా కార్యకర్తలు ఇలా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి అనర్హులుగా గుర్తించారు. ప్రజా సాధికారిక సర్వేలో పేరు నమోదు కాని వారి పేరు జాబితాలో కనిపించాయి.

మరీ ప్రధానంగా ప్రజా సాధికారిక సర్వేలో కుటుంబ యజమానికి ముగ్గురు, నలుగురు వివాహమైన కుమారులు ఉంటే వీరిలో ఏ ఒక్కరైన ఇంటికి దరఖాస్తు చేసుకుంటే తండ్రికి ఉన్న ఆస్తిని చూపించి తొలగించారు. ఇలా దాదాపు 70 శాతానికి పైగా తప్పులు వెలుగుచూస్తున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాల్లో ఇదేతీరు కనిపిస్తోంది. అక్కడ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అందరికీ గృహాల లబ్ధిదారుల పేర్లను ప్రజాసాధికార సర్వే జాబితా ఆధారంగా పరిశీలన చేయడంతో అనేకమంది అర్హులు కూడా అనర్హులయ్యారు. ప్రజా సాధికార సర్వే నమోదు ప్రక్రియ సక్రమంగా జరగకపోవడమే ఇందుకు కారణం. సర్వే సమయంలో గణకులు ప్రతిఒక్కరి సమగ్ర వివరాలను సేకరించాలని పదేపదే చెప్పిన కొందరు మొక్కుబడిగా నమోదు చేశారు.

అందుకు ట్యాబ్‌ల సర్వర్‌ పలుమార్లు మొరాయించడం, సరిగ్గా పనిచేయకపోవడంతో కొద్దిపాటి సమాచారంతోనే ముందుకెళ్లారు. ఇంకొందరైతే కొన్ని వివరాలకు సంబంధించి వాస్తవ సమాచారం నమోదు చేయలేకపోయినట్లు సమాచారం. ఒకచోట కూర్చోని కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టానుసారంగా నమోదు చేయడంతో ప్రస్తుతం అంతర్జాలంలో తప్పుల తడకలు వెలుగు చూస్తున్నాయి. నిరుపేద వర్గాలతో పాటు మహిళలకు సైతం కార్లు, మోటారు సైకిళ్లు, స్థిరాస్తులు ఉన్నట్లుగా నమోదైంది. మరికొందరివి అసలు సర్వే జాబితాలోనే పేరు లేకపోవడంతో గృహ పథకం నుంచి తొలగించారు. వీరంతా మొదటి వాయిదా సొమ్ము కట్టిన లబ్ధిదారులే. సర్వేలో జరిగిన లోపాలతో ఇప్పుడు అర్హులైన తమను అనర్హులుగా పేర్కొనడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో వాస్తవాలు నమోదు జరిగేలా మళ్లీ కార్యక్రమం తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts