విజయవాడ, సెప్టెంబర్ 6,
తెలుగుదేశం పార్టీతో పొత్తునకు జనసేన పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుంది అని అంతా అనుకుంటారు. ఏపీ రాజకీయాల మీద అవగాహన కలిగిన వారు అంతా కూడా ఇలాగే ఆలోచిస్తారు. మరో వైపు పవన్ కళ్యాణ్ కూడా పార్టీని అలా ఉంచి సినిమాలు చకచకా చేసుకుంటున్నారు అంటే దాని అర్ధం ఎన్నికల వేళకు పొత్తులతో ముందుకు సాగవచ్చు అన్న ఎత్తుగడతోనే అని అంటారు. సరే ఇవన్నీ ఇలా ఉన్నా టీడీపీతో జనసేన పొత్తు ఈసారి అంత ఆషామాషీగా కుదరదు అంటున్నారు. దానికి బోలెడు కండిషన్లు అప్లై అవుతాయని కూడా చెబుతున్నారు. చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన అభిమానమని చెబుతున్నారు. చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అని వ్యూహకర్త అని పవన్ కళ్యాణ్ ఇప్పటికీ నమ్ముతారు. ఆయన అప్పట్లో ప్రచారంలో అన్న మాట కూడా అదే, బాబుకు అనుభవం ఉంది కాబట్టి ఆయన్ని ఎన్నుకోవాలి అని. రేపటి ఎన్నికల్లో కూడా ఆయన బాబుని చూసే మాత్రమే టీడీపీకి మద్దతు ఇస్తారు అంటున్నారు. అదే సమయంలో లోకేష్ ని మాత్రం సైడ్ చేయాల్సిందే అన్న కండిషన్ ఉంటుందిట. బాబు సీఎం అభ్యర్ధిగా ఉంటేనే జనసేన నుంచి పొత్తు ఉంటుందని కూడా షరతు విధిస్తారు అంటున్నారు.పవన్ కళ్యాణ్ ఎపుడూ పాతికేళ్ళ రాజకీయం తనదని చెబుతారు. అందువల్ల ఆయన టార్గెట్ అంతా 2029 అనే అంటారు. అంటే 2024 ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని టీడీపీని సమర్ధించినా 2029కి మాత్రం జనసేన సొంతంగానే అధికారంలోకి రావాలి అన్నదే పవన్ కళ్యాణ్ ఆలోచనట. అంతదాకా బలం పుంజుకుని నిలబడడానికే ఈ పొత్తుల ఎత్తులు అంటున్నారు. అంటే టీడీపీతో పొత్తుల సందర్భంగా పెద్ద ఎత్తున సీట్లు డిమాండ్ చేయడం, గెలిచిన తరువాత ప్రభుత్వంలో చేరి కీలక మంత్రిత్వ శాఖలను తీసుకోవడం ద్వారా జనసేన తన అధికార రాజకీయాన్ని మొదలుపెడుతుంది అంటున్నారు. అదే సమయంలో టీడీపీలో లోకేష్ వారసత్వాన్ని ముందుకు తెచ్చి బాబు సైడ్ అవుతాను అంటే మాత్రం జనసేనకు అది ఎంతమాత్రం ఇష్టం ఉండదు అంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ కానీ జనసైనికులు కానీ అంచనా వేసేది ఏంటి అంటే ఫ్యూచర్ లో వైసీపీతోనే తమకు పోటీ అని. టీడీపీకి ఒక్క చాన్స్ ఇస్తే గిస్తే అది 2024లో మాత్రమే అని కూడా అంటున్నారు. ఇక 2029 నాటికి జగన్ తోనే తాము పోటీ పడతామని, అప్పటికి టీడీపీ ఉనికి కూడా ఇబ్బందులో పడుతుంది అని కూడా భావిస్తున్నారు. అలా పడాలి అని కూడా కోరుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీగా అలా కోరుకోవడం కూడా తప్పుకాదు. ఎందుకంటే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ సీఎం అవాలి కాబట్టి. మరి చంద్రబాబు కనుక తన కుమారుడి కోసమే రేపటి వేళ రాజకీయం చేస్తే జనసేన నుంచే తొలి వ్యతిరేకత వస్తుంది అని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఈసారి పవన్ తమ్ముడు అంత ఈజీగా బాబుతో చేతులు కలపరు అన్నదే రాజకీయ వర్గాలలో టాక్.