శ్రీకాకుళం, సెప్టెంబర్ 6,
అసలే కరోనా ఎఫెక్ట్‌తో జనాలు వణికిపోతున్నారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగుతూ.. పడరాని పాట్లు పడ్డారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోంది. దేశంలో కరోనా అదుపులో ఉంది. కానీ మరో మహమ్మారి జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మళ్లీ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పేషెంట్లతో హాస్పిటల్స్ మళ్లీ నిండిపోతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ లక్షణాలను చూసి కరోనా పేషెంట్లు అనుకుంటున్నారా? ఇది కరోనా కాదు. సీజన్ ఎఫెక్ట్.. సీజన్‌లో వచ్చే వైరస్ ఫీవర్స్‌తో చాలా మంది రోగులు మంచాన పడుతున్నారు.డెంగ్యూతోపాటు మలేరియా, టైఫాయిడ్ ప్రజలపై ముప్పేట దాడి చేస్తున్నాయ్. గతంలో ఎన్నడూ లేనంతగా విష జర్వాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు పేట్రేగిపోతుండటంతో రోజురోజుకీ బాధితుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. దాంతో, ఇప్పటివరకు కోవిడ్ సేవలందించిన ఆస్పత్రులు, వార్డులన్నీ డెంగ్యూ పేషెంట్లతో నిండిపోతున్నాయి. పడకేస్తోన్న పల్లెలు, పట్టణాలు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ముప్పేట దాడి.. వెంటాడుతోన్న కరోనా భయం.డెంగ్యూ లక్షణాలు.. కరోనా సిమ్ టమ్స్ ఒకేలా ఉండటంతో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. ఏది వైరల్ ఫీవరో.. ఏది కరోనా వ్యాధో అర్ధం కాక.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..కర్నూలు జిల్లాలో అధికారికంగా 73 డెంగ్యూ జ్వరాలు నమోదైతే.. అలాంటి లక్షణాలతో 930 మంది చికిత్స తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. గత ఏడాది అధికారిక లెక్కల ప్రకారం 16 మందికి డెంగ్యూ జ్వరాలు సోకగా ఈ ఏడాది ఇప్పటికే ఐదు రెట్లు పెరిగింది. ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా చాలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో పల్లెలు, పట్టణాలు, పడకేశాయి. కాకినాడ, పెద్దాపురం, రాజమహేంద్రవరం, పిఠాపురం, చింతూరు డివిజన్లలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే 160కి పైగా కేసులు నమోదయ్యాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి రోజుకు 20 మంది పేషెంట్లు వస్తున్నట్టు వైద్యులు చెప్తున్నారు.తొమ్మిది మండలాల పరిధిలో విస్తరించిన మన్యం.. ఐదు మున్సిపాలిటీలు.. ఒక కార్పోరేట్.. 13 మేజర్ పంచాయతీలు.. వెయ్యికి పైగా పంచాయతీలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో.. డెంగ్యూ చెలగాటం ఆడుతోంది. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి కట్టడిలో ఊపిరి సలపకుండా అధికారులు పనిచేశారు. ఇంతలోనే డెంగ్యూ విరుచుకుపడటంతో.. జిల్లా అధికారులకు సవాల్‌గా మారింది. మిగిలిన జిల్లాల్లోనూ దాదుపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోగులకు ప్లేట్‌లెట్స్ అందించడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సో.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.