గుంటూరు, సెప్టెంబర్ 6,
వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే కాబోయే సిఎం నారా లోకేష్. చంద్రబాబు తనయుడికి పట్టాభిషేకం చేసి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారు. ఇది పసుపు పార్టీలోని యువజనుల టాక్. ఈ స్లోగన్ మొదలైన నాటి నుంచి టిడిపి పార్టీ సీనియర్ల లో వణుకు మొదలైంది. వచ్చే ఎన్నికల ముందు కానీ ఇదే అజండా తో ముందుకు వెళితే పార్టీ కి అధోగతి తప్పకపోవచ్చన్నది వారి ఆందోళనకు కారణంగా కనిపిస్తుంది. దీనికి చినబాబు లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఫెయిల్ కావడం ఒక కారణం అయితే ఆయనకు అనుభవలేమి పార్టీని ఏ స్థాయికి చేరుస్తుందో అన్న భయం కూడా తోడౌతుంది. దాంతో కుండబద్ధలు కొట్టినట్లు ఈ విషయాన్ని అధినేత ముందు ఉంచేందుకు అంతా వెనుకాడుతున్నారు. పిల్లి మెడ లో గంట ఎవరు కడతారా అని టిడిపి సీనియర్లు కిందా మీదా పడుతున్నారట.రాజమండ్రి రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చాలా కాలంగా అసంతృప్తి నడుమ టిడిపి లో రగిలిపోతున్నారు. ఆయన ఇటీవల రాజీనామా అంటూ హడావిడి చేసింది అధినేతతో పార్టీలో జరుగుతున్న తప్పులను సుదీర్ఘంగా ఎత్తి చూపేందుకే అన్న అంశం తేలిపోయింది. ఆ అవకాశం చంద్రబాబు కల్పించకపోవడంతో గోరంట్ల రాజీనామా అస్త్రం ప్రయోగించి అధిష్టానం దిగి వచ్చేలా చేశారు. దాంతో గోరంట్ల ఫోన్ చేసినా ఎత్తి నిమిషం కూడా మాట్లాడటానికి అవకాశం ఇవ్వని చంద్రబాబు 45 నిమిషాలు పార్టీ స్థితిగతులపై సీనియర్ నేతతో చర్చించే అవకాశం ఇవ్వక తప్పింది కాదు. ఆ ఛాన్స్ దొరకడమే ఆలస్యం గోరంట్ల అసలు సంగతి బయట పెట్టేశారు.లోకేష్ పట్టాభిషేకం పక్కన పెట్టండి. మీ తరువాత ఆయన ఎలాగూ పార్టీ పగ్గాలు పట్టుకుంటారు. ఈ లోపు మీరు పక్కకు పోతే ఫ్యాన్ గాలిలో అంతా కొట్టుకుపోతాం. చినబాబు నేర్చుకోవాలిసింది చాలా ఉంది. ఇప్పుడు రిస్క్ లు చేసే సమయం కాదు. అధికారంలో ఉన్నప్పుడు మీకు బాకా ఊది పదవుల్లో వెలిగిన సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటివారు మంత్రులు గా వెలగబెట్టినవారు ఇప్పుడు ఎక్కడ అంటూ గోరంట్ల రెచ్చిపోయారని ఆయన సన్నిహితుల సమాచారం.పార్టీ వర్గాలకు తక్షణం ఒక క్లారిటీ కావాలి. మీ నాయకత్వంలోనే 2024 ఎన్నికలకు టిడిపి సమాయత్తం కావాలిసిందే మీరే ముఖ్యమంత్రి అభ్యర్థి గా ఉండాలిసినదే అని తేల్చేశారుట గోరంట్ల. ఈ అంశాలు చంద్రబాబు కు సైతం బాగా నచ్చాయని చినబాబు భావి సిఎం అంటూ పార్టీలో జరుగుతున్న ప్రచారం కాదనలేక, ఔను అనలేక మదన పడుతున్న బాబుకు ప్రస్తుతం బుచ్చయ్య వివాదం అన్ని రకాలుగా పనికొచ్చేదే అయ్యిందంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో జగన్ సేనను ఢీ కొట్టే సేనాని తానేనని చంద్రబాబు చెప్పక చెప్పేశారని తెలుస్తుంది.