విశాఖపట్టణం, సెప్టెంబర్ 6,
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రయివేటీకరణ దిశగానే అడుగులు వేస్తుంది. కానీ అధికార, విపక్ష పార్టీలు మాత్రం ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక సెంటిమెంట్. ఒక నమ్మకం. దీనిని ప్రయివేటీకరిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జరిగే నష్టంతో పాటు ఇక్కడ అధికార పార్టీపై కూడా ప్రభావం ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోలేక పోయినప్పుడు అధికార పార్టీ వైసీపీకి తిరిగి ఓట్లు అడిగే అర్హత కూడా లేదన్న కామెంట్స్ కార్మికుల నుంచే విన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖలు రాశారు. ప్రయివేటీకరించవద్దని కోరారు. న్యాయస్థానంలో జరుగుతున్న కేసులో కూడా తాము ప్రయివేటీకరణకు వ్యతిరేకమని రాష్ట్ర ప్రభుత్వం తరుపున అఫడవిట్ దాఖలు చేశారు. అయినా కూడా కార్మికుల్లో అధికార పార్టీపై అసంతృప్తి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ బలంగా ఉన్నారు. ఆయనను సంఖ్యా పరంగా ఏమీ చేయలేం. కాని రాజ్యసభలో బలహీనంగా ఉండటంతో కీలక బిల్లుల విషయంలో మెలిక పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని కార్మికవర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాలు అధికార పార్టీ ఎంపీలను కలసి వివరించాయి. భవిష‌్యత్ లో బీజేపీకి అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వకూడదని కార్మిక సంఘాలు షరతు పెడుతున్నాయి. అధికార పార్టీపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు వత్తిడి తెస్తున్నారు.మరోవైపు ప్రతిపక్ష పార్టీ పరిస్థితి కూడా అంతే. సభ్యుల బలం తక్కువగా ఉండటంతో తాము రాజీనామాలు చేస్తామని చెబుతున్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే తాము విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేస్తామని ప్రకటిస్తున్నారు. అయితే దీనిని రాజకీయ డ్రామాగా కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం భవిష్యత్ లో వైసీసీ, టీడీపీ లకు తలనొప్పిగా మారనుంది.