విజయవాడ, సెప్టెంబర్ 6,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే క్రమంలో.. ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నారా? సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు.. ఆయన వ్యవహారశైలి అవుననే సమాధానం చెబుతోంది. సందర్భానుసారం మాట్లాడ్డం.. ముఖ్యమైన విషయాలపై ట్వీట్లు చేయడం తప్ప.. పెద్దగా హడావుడి చేయకుండా.. ఆయన ఎదురుచూస్తున్న తీరు సైతం.. సరికొత్త వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. చంద్రబాబు 3 ప్రధాన విషయాలపై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. అందులో ఒకటి రాష్ట్ర అప్పులు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లలో చేసిన అప్పులను ఇప్పటి జగన్ ప్రభుత్వం ఏడాదిలోనే చేసిందంటూ పార్టీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. పూర్తి స్థాయి లెక్కలను రెడీ చేసి.. ప్రభుత్వంపై పోరాటానికి ఈ అంశాన్ని ప్రధాన ఆయుధంగా చంద్రబాబు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఇక రెండోది.. జగన్ పై ఉన్న కేసులు. ఈ విషయం వారం వారం కాస్త సాగదీతగా ముందుకు జరుగుతోంది. అందులోనూ.. నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ అంశంలో తీర్పు రావాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిపైనా దృష్టి పెట్టిన చంద్రబాబు.. తర్వాత రాబోయే స్పష్టమైన పరిణామాలను తనకు.. ముఖ్యంగా టీడీపీ మనుగడకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. న్యాయ పరమైన విషయాలపై అపరిమితమైన పట్టు ఉన్న చంద్రబాబు.. ఈ విషయాలపై కాస్త ఎక్కువగానే దృష్టి పెడుతున్నట్టుగానూ తెలుస్తోంది. ప్రత్యర్థి దూకుడుకు దీంతోనే ఆయన అడ్డుకట్ట వేసే అవకాశమూ ఉంది.మూడో అంశం. రాష్ట్రంలో దాడులు.. నిరుద్యోగుల సమస్యలు. దిశ చట్టం అమల్లోకి వచ్చినా.. అక్కడక్కడా జరుగుతున్న దాడులను టీడీపీ హైలైట్ చేస్తోంది. లోకేష్ ఈ విషయాన్ని లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. నిరుద్యోగుల సమస్యపైనా.. టీడీపీ నేతలు కాస్త ఎక్కువగానే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. రాను రాను ఈ విషయాన్ని సైతం చంద్రబాబు సీరియస్ గా తీసుకుని.. జనాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక చివరి అస్త్రంగా.. తాను కానీ.. లోకేశ్ కానీ.. పాదయాత్ర చేస్తే.. జనాల్లోకి వెళ్లి.. పార్టీకి మళ్లీ క్రేజ్ తీసుకువస్తే ఎలా ఉంటుందని కూడా.. చంద్రబాబు ఆలోచన చేయవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే.. పార్టీ శ్రేణులకు పండగే అని చెప్పవచ్చు. మళ్లీ జనాల్లోకి వేగంగా దూసుకువెళ్లేందుకు అదో అవకాశంగా టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం భావించవచ్చు. చూడాలి మరి.. చంద్రబాబు ఆలోచనలు.. అడుగులు ఎలా ఉన్నాయో.