YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

మట్టిమాఫియాదే రాజ్యం

మట్టిమాఫియాదే రాజ్యం

అక్రమాలకు కాదేదీ అనర్హమన్నట్లుగా.. అక్రమార్కులు చెరువుల్లో మట్టిని కూడా వదలడం లేదు. పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా.. అనుమతులకు మించి వేల క్యూబిక్‌ మీటర్ల కొద్దీ మట్టిని తరలించుకుపోతోంది. ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి కొడుతోంది. ఈ అక్రమ దందాకు జిల్లా నీటిపారుదల శాఖ ఈఈ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా అధికారులు ఖాతరు చేయడం లేదు. వే బిల్లులు లేకుండా ఓవర్‌లోడ్‌తో మట్టిని తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కేవలం 18 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టి కోసం అనుమతులు పొంది.. నెల రోజుల్లో జిల్లాలోని నాలుగు చెరువుల్లో లక్షా 40 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించుకుపోయారు. అదనపు మట్టికి సీనరేజీ చార్జీలు చెల్లించకుండా సుమారు రూ.45 లక్షలు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.

మిషన్‌ కాకతీయ నిధులతో చెరువుల్లో తీస్తున్న పూడిక మట్టిని రైతులు ఉచితంగానే తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాణిజ్య అవసరాల కోసమైతే సీనరేజీ ఫీజు చెల్లించి మట్టిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాగా, మిషన్‌ కాకతీయలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌, చిన్నకల్వల, చిన్నబొంకూర్‌ చెరువులతోపాటు రామగుండం అల్లూరు చెరువులో కొంత మేరకు పూడిక మట్టిని తీశారు. ఈ చెరువుల్లో ఇంకా మట్టిని తీసే అవకాశమున్నా.. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన మేరకు పనులు చేపట్టారు. ఇలాంటి చెరువుల్లో వాణిజ్య అవసరాలకు మట్టిని తీసుకోదలచిన వారు పంచాయతీ తీర్మానం మేరకు జిల్లా గనులు, భూగర్భ శాఖ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం గత ఏడాది వరకు అమల్లో ఉంది. ఈ ఏడాది నుంచి చెరువుల మట్టి కావాలనుకునే వారు జిల్లా నీటి పారుదల శాఖాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు క్యూబిక్‌ మీటర్‌ మట్టికి రూ.40 చొప్పున సీనరేజీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు చాలా మంది మట్టి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పెద్దపల్లి, సుల్తానాబాద్‌, కమాన్‌పూర్‌, మంథని, రామగుండం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే ఇటుకలకు మంచి డిమాండ్‌ ఉంది. స్థానిక అవసరాలకు పోను కరీంనగర్‌, హైదరాబాద్‌ వంటి నగరాలకు ఇక్కడి నుంచి ఇటుకలు సరఫరా చేస్తున్నారు. దీంతో ఇటుక బట్టీల యజమానులు సీజన్‌కు సరిపడా మట్టిని వేసవిలోనే సమకూర్చుకుంటారు. కాగా స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని చెరువుల నుంచి కొంత కాలంగా మట్టిని తీసుకుంటున్నారు. ఈ ఏడాది అనుమతులు తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా, కొందరు దళారులు.. నామమాత్రంగా అనుమతులు తీసుకుని, మట్టిని ఇటుక బట్టీల యజమానులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా మియాపూర్‌ చెరువులో 4 వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు పొంది 30 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా మట్టిని తరలించుకుపోయారు.

దీనిపై గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ జరపలేదు. చిన్నబొంకూర్‌ చెరువు నుంచి 5 వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు పొంది.. 20 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించుకుపోయారు. ఈ రెండు చెరువుల అనుమతులను మియాపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు పొంది సొమ్ము చేసుకుంటున్నారు. చిన్నకల్వల చెరువు నుంచి 5 వేల క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు పొంది 30 వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని తీసుకెళ్లారు. రామగుండం మండలం అల్లూరు చెరువు నుంచి కూడా పెద్ద ఎత్తున మట్టిని తరలించుకుపోయారు. ఈ రెండు చెరువుల అనుమతులను పెద్దపల్లి రంగాపూర్‌ గ్రామానికి చెందినవారు పొంది.. ఇటుక బట్టీల యజమానులకు మట్టిని విక్రయిస్తున్నారు.

వే బిల్లులు లేకుండా రాత్రివేళల్లో ఓవర్‌లోడ్‌తో మట్టిని తరలిస్తున్న వాహనాలను రంగాపూర్‌ గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే వాటిని ఆ తర్వాత పోలీసులు వదిలి పెట్టినట్లు సమాచారం. ఆ తర్వాత మరో వాహనాన్ని పట్టుకుని తహసీల్దార్‌కు అప్పగించడంతో జరిమానా విధించారు. ఈ అక్రమ దందాపై జిల్లా కలెక్టర్‌కు ఏప్రిల్‌ 23న ఫిర్యాదు చేయడంతో అనుమతులను రద్దు చేసి, వాహనాలపై కేసులు నమోదు చేయించి విచారణ జరిపించాలని ఆదేశించారు. అయినా సంబంధిత నీటి పారుదల శాఖ అధికారి పట్టించుకోలేదు. పైగా మరో చెరువుకు అనుమతి ఇచ్చారు. దీంతో రంగాపూర్‌ గ్రామస్థులు ఈ నెల 30న జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేయగా.. అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు. అయినా చిన్నబొంకూర్‌ చెరువులో బుధవారం వరకూ మట్టి తరలింపు కొనసాగింది. ఈ అక్రమ దందాకు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారి సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని, ఒక్కో చెరువుకు అనుమతి ఇచ్చేందుకు ముందస్తుగానే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు మామూళ్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Related Posts