కరీంనగర్, సెప్టెంబర్ 6,
తెలంగాణలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అన్న విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంతో కలిపి.. దీపావళి తర్వాతే ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న స్పష్టతను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చేసింది. ఏపీలో చూస్తే.. పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది.
హుజురాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ చతుర్ముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్.. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి మరో అభ్యర్థి, వీరితో పాటుగా షర్మిల పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తెలంగాణ జన సమితి పార్టీ, లెఫ్ట్ పార్టీలు, తెలుగుదేశం.. ఇలా చిన్నాచితకా మరెన్నో పార్టీలు ఉన్నాయి. వీరందరికీ.. తోడైతే తీన్మార్ మల్లన్న కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో లాభనష్టాలెవరికి అన్న చర్చ.. రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ప్రధాన పోటీ.. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అందులో.. పోటీలో నిలబడే మిగతా పక్షాల కారణంగా ఓట్లు చీలి.. అది టీఆర్ఎస్, బీజేపీకి పడే ఓటింగ్ పై ప్రభావం చూపుతుందన్న బలమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫలితంగా.. ఫిక్స్ డ్ ఓటు బ్యాంకు ఉన్న పార్టీకి కాస్త ప్రయోజనం కలిగే అవకాశం కనిపిస్తోంది.అంటే.. పోటీలో ప్రధానంగా ఉన్న పక్షాలకు.. కచ్చితమైన ఓటు బ్యాంకు అంటూ ఉంటుంది. ఆ ఓటు నిధిని ప్రత్యర్థులు చీల్చే విషయంపైనే కచ్చితంగా గెలుపోటములు ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో.. టీఆర్ఎస్ నాయకులు బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని.. కాబట్టి తమకు ఓటు బ్యాంకు చీలే అవకాశమే లేదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. తన ఇమేజ్, తనకు 20 ఏళ్లకు పైగా స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకు చెక్కు చెదరదని ధీమాగా ఉన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం.. ఈ సారి చీలే ఓట్లు తమకే పడతాయని విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఎవరి అంచనాలు నిజమవుతాయి? ఎవరి ఓట్లు ఎవరిని ప్రభావితం చేస్తాయి? అంతిమంగా హుజురాబాద్ గడ్డపై విజయనాదాన్ని వినిపించేదెవరన్నది.. ఆసక్తికరంగా మారింది.