YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

పాదయాత్ర.. ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్...

పాదయాత్ర.. ఇప్పుడు పొలిటికల్ ట్రెండ్...

హైదరాబాద్, సెప్టెంబర్ 6, 
పాదయాత్ర చేస్తే.. అధికారం ఖాయమా? ఎన్నికలకు ముందు జనాన్ని నేరుగా కలిస్తే.. గెలుపు తనంతట తానే మన దగ్గరకు వస్తుందా? గతంలోని ఉదాహరణలు చూపించి.. అది నిజమే అని చాలా మంది అంటుంటారు. అందుకు 2003లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర నాంది పలికిందనే చెప్పవచ్చు. ఆనాడు కాంగ్రెస్ ను ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో.. ఆయన చేసిన పాదయాత్ర.. సంచలనాన్ని సృష్టించింది. కాంగ్రెస్ ను పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చింది.తర్వాత.. 2013లో చంద్రబాబు చేసిన పాదయాత్ర ఆ పార్టీకి మంచి మైలేజీ తీసుకువచ్చింది. ఉమ్మడి రాష్ట్ర విభజన ఖాయమైన అనంతరం.. 2014లో జరిగిన ఎన్నికల్లో.. అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పించింది. తర్వాత.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సైతం 2018లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నప్పుడు ఆయన సోదరి షర్మిల.. జగన్ తరఫున జనంలోకి వెళ్లారు. చివరికి.. 2019లో జరిగిన ఎన్నికల్లో ఫలితాన్ని మనం చూశాం. అనూహ్యంగా జగన్ భారీ ఆధిక్యంతో పవర్ లోకి వచ్చారు.ఇప్పుడు తెలంగాణలో చూస్తే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంత్రిగా ఉన్న నేత.. ఆరోపణలు రాగానే రాజీనామా చేసి.. బీజేపీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా జనాల్లోకి వెళ్తూ.. రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఆయన సైతం.. పాదయాత్రనే ఆయుధంగా చేసుకున్నారు. నియోజకవర్గాన్ని మొత్తాన్నీ చుట్టేసే ప్రయత్నం చేశారు.అలాగే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పాదయాత్రతో జనాల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల మీద విమర్శలు చేస్తున్నారు. వీరందరితో పాటు.. నిత్యం కేసీఆర్ పై, టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ.. ప్రస్తుతం ఓ కేసులో జైలుపాలైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సైతం.. ఓ దశలో భారీ పాదయాత్రకు నిర్ణయం తీసుకున్నారు. కానీ.. అనుకోని పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారు.ఇదంతా చూస్తుంటే.. అటు ఆంధ్రాలో.. ఇటు తెలంగాణలో.. రాజకీయ నేతలు.. పాదయాత్రను ఓ గెలుపు మంత్రంగా భావిస్తున్నారని చెప్పవచ్చు. కానీ.. ఒకరిని చూసి.. మిగతా అంతా అదే పని చేస్తే.. అప్పుడు పాదయాత్ర అన్నది చాలా మందికి ఓ వృథా ప్రయత్నంగానే మిగిలే అవకాశాలున్నాయి. ఇలాంటి స్థితిలో.. నేతలు సరికొత్తగా ఎలాంటి ప్రయత్నాన్ని చేస్తారు.. జనాన్ని కలిసేందుకు వినూత్నంగా ఎలా ప్రయత్నిస్తారన్నది.. చూడాలి.

Related Posts