ఈనెల 8న రైతన్నల ఆందోళన ను విజయవంతం చేయండి
పలు డిమాండ్ల సాధన కై రైతన్నలు కలెక్టరేట్ ముట్టడి
జగిత్యాల, సెప్టెంబర్ 6
వ్యవసాయేతర ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగి వ్యవసాయ రైతులకు లాభసాటి ధరలు రాక నష్టపోతున్నారని రైతన్నల ప్రయోజనాలకై పలు డిమాండ్లతో ఈ నెల 8న జగిత్యాల కలెక్టరేట్ ఎదుట రైతన్నలు చేపట్టే ఆందోళన, ముట్టడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాగుల లింగారెడ్డి, ఇప్ప రాజేందర్ రెడ్డిలు కోరారు. సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న రైతన్నల పలు డిమాండ్ల సాధనకై ఈ నెల 8న భారతీయ కిసాన్ సంఘ్ కేంద్ర నాయకత్వం దేశంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళన, ముట్టడి కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చారని లింగారెడ్డి, రాజేందర్ లు పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ రైతులకు నష్టాలు ఎదురవుతుంటే వ్యవసాయేతర ఉత్పత్తుల పై గత 30 ఏండ్లుగా 150 నుంచి 3 వందల రేట్లు పెరిగాయని అన్నారు. అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్న చందాన తమ డిమాండ్ల సాధన కై రైతన్నలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారని అన్నారు. ప్రధానంగా ఎం.ఎస్.పి.కి గ్యారంటీ, చట్టబద్దత, ఎం.ఎస్.పి.కి తక్కువగా కొనుగోలు చేసేవారిపై క్రిమినల్ కేసులు, లాభసాటి ధర కల్పన, పసుపు పంటకు ఎం.ఎస్.పి.ని ప్రభుత్వాలే కల్పించాలని, నూ తన వ్యవసాయ చట్టాలను సవరించాలని, ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపించాలనే డిమాండ్లతోపాటు పలు డిమాండ్లతో రైతన్నలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాగుల లింగారెడ్డి, ఇప్ప రాజేందర్ రెడ్డిలు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జలందర్, రమేష్ గౌడ్, సహాయ కార్యదర్శి రవి, కోశాధికారి నర్సారెడ్డి, సభ్యులు సురేందర్, లక్ష్మణ్ రెడ్డి, రాంరెడ్డి, లింగారెడ్డి, మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ లు ఉన్నారు.