వినాయక చవితి పండుగకు ప్రభుత్వం అనుమతించకపోతే ఆత్మహత్యలే శరణ్యం
- విగ్రహాల తయారీ దారులు
నరసరావుపేట
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పందిరి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని విగ్రహాల తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయక ఉత్సవ విగ్రహాల తయారీదారులు నరసరావుపేటలో గత కొన్ని సంవత్సరాలుగా డా॥ కొండపల్లి వెంకటేశ్వర్లు హాస్పిటల్ వెనుక, సమీపంలోని 2 ఎకరాల స్థలంలో వినాయక ఉత్సవ విగ్రహాలను పెద్దఎత్తున తయారుచేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రం నుండి వీరు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. దాదాపు 50 మంది వర్కర్స్ ఈ విగ్రహాల తయారీలో నిత్యం నిమగ్నమై వుంటారు. ఒక అడుగు నుండి 15 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను ఇక్కడ తయారుచేస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా వినాయక చవితి బహిరంగ ఉత్సవాలకు అనుమతిని మంజూరు చేయకపోవడంతో ఇక్కడ విగ్రహాల తయారీదారులు దేవా మరియు గీతా దంపతులు, పలు కుంటుంబాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరు సోమవారం నాడు విలేకరుల తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. దాదాపు 1 కోటి 30 లక్షల రూపాయలను వడ్డీలకు తెచ్చి ఈ విగ్రహాల తయారీపై పెట్టుబడులు పెట్టామన్నారు. కోవిడ్ కారణంగా గత ఏడాది కూడా ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్ధికంగా ఎంతో నష్టపోయామన్నారు. పెట్టుబడులు వడ్డీలకు తేవడంతో అప్పులిచ్చిన వారు తమ భాకీలు తీర్చమని వత్తిడి తెస్తున్నారన్నారు. అయితే ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదన్నారు. వేలాది విగ్రహాలు ఇక్కడ తయారై వున్నాయన్నారు. ఇప్పటికే కరెంటు బిల్లులు, జీతాలు, అద్దెలు ఇతర ఖర్చులను ప్రతినెలా చెల్లిస్తూ నిండామునిగి పోయామన్నారు. ఇక ఇక్కడ తయారు చేసిన విగ్రహాలు ఈ ఏడాది కూడా అమ్ముడవకపోతే, పెట్టుబడులు రాక, భాకీలు తీర్చలేక తాము ఆత్మహత్యలే చేసుకోవాల్సిందేనని వారు తీవ్ర భయాంధోళనలు వ్యక్తం చేస్తున్నారు. తామేకాదు రాష్ట్రవ్యాప్తంగా తమలాగా విగ్రహాల తయారీదారుల అందరి పరిస్థితులు కూడా కడు దయనీయంగా ఉన్నాయన్నారు. పల్నాడు ప్రాంతం వారే కాకుండా, జిల్లా లోని పలు ప్రాంతాల నుండి కూడా వేల మంది ఇక్కడకు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేస్తుంటారని, వెయ్యి రూపాయల నుండి 50 వేలు ఖరీదు చేసే విగ్రహాలు ఇక్కడ లభిస్తున్నాయని వారు పేర్కొన్నారు.