తిరుపతి, సెప్టెంబర్ 7,
చంద్రబాబు ఇపుడు కొడుకు లోకేష్ గురించి ఆలోచిస్తున్నారు. ఆయన ఒక విధంగా పుత్ర ప్రేమతో నిండా మునిగారు. తన తరువాత లోకేష్ సీఎం కావాల్సిందే అన్నది చంద్రబాబు మార్క్ ఫిలాసఫీ. ఈ విషయంలో లోకేష్ ఎవరికంటే తక్కువ అన్నది బాబు వాదన. ఇంత పెద్ద పార్టీలో తన వారసుడి కంటే కూడా సీఎం పదవికి వేరే అర్హులు లేరని కూడా చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఆయన లోకేష్ కోసం ఏం చేయాలన్నా కూడా రెడీ అంటున్నారు. ఇక చంద్రబాబు వ్యూహాలు అన్నీ కూడా లోకేష్ చుట్టూనే తిరగడం విశేషం.కుప్పం పేరు వింటే చంద్రబాబు అన్న మాట కూడా ఠక్కున గుర్తుకు వస్తుంది. చంద్రబాబు తొలిసారిగా 1989లో అక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత వరసబెట్టి మరో ఆరు సార్లు కుప్పం నుంచి బాబు గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు, ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా రాణిస్తున్నారు. ఒక విధంగా నారా ఫ్యామిలీకి కుప్పం అచ్చి వచ్చినదని చంద్రబాబు సెంటిమెంట్. అందుకే భావి ముఖ్యమంత్రి లోకేష్ జాతకం మారాలంటే కుప్పం ఎమ్మెల్యేగా ఆయన గెలిచి తీరాలని చంద్రబాబు అనుకుంటున్నారుట.ఇక మరో వైపు కొడుక్కి కుప్పం ఇస్తే చంద్రబాబు సంగతేంటి అన్న ప్రశ్న వస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయను అంటున్నారుట. కుప్పం ఇక మీదట ఏలమంటూ లోకేష్ కి ఇచ్చేసిన చంద్రబాబు తాను పోటీ చేయకుండా కేవలం పార్టీ ప్రచారానికే పరిమితం అవుతారని అంటున్నారు. అలా చేయడం వల్ల పార్టీ గెలుపు సాధ్యమవుతుందని తలపోస్తున్నారు. అదే నేపధ్యంలో జనాల్లో కూడా తాను పోటీ చేయలేదు అంటే ముఖ్యమంత్రి పదవి కంటే రాష్ట్ర ప్రయోజనాలు తనకు ముఖ్యమని చెప్పుకుని సానుభూతి పొందవచ్చునని వ్యూహ రచన చేస్తున్నారుట.సరే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ ఓకేగానే ఉంది. కొడుక్కి సీటు చూపిస్తారు. అసెంబ్లీ లోపలికి పంపుతారు. కానీ చంద్రబాబు పోటీ చేయకుండా ఉంటే క్యాడర్ గట్టిగా నిలబడి వర్క్ చేస్తుందా అన్నదే డౌట్. ఇక చంద్రబాబు పోటీకి దూరం అంటే ఓటమి భయమన్న సంకేతాలు కూడా వెళ్తాయని కూడా పార్టీ నాయకులు అంటున్నారు. మరో వైపు లోకేష్ ని ముందు పెట్టి చంద్రబాబు తప్పుకుంటే పార్టీ పుట్టె మునగడం ఖాయమని కూడా హెచ్చరించేవారూ ఉన్నారు. అయితే చంద్రబాబు ఇపుడు లోకేష్ గురించే ఆలోచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకు ఓడి వాడకూడదు, ఎమ్మెల్యే కావాల్సిందే. పార్టీ గెలిస్తే ఆ తరువాత ఎమ్మెల్సీగా అయినా తాను గెలిచి ముఖ్యమంత్రి కావచ్చు అన్నది చంద్రబాబు ప్లాన్ గా ఉందిట. చూడాలి మరి ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో