YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ నేతలు

టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ నేతలు

కడప, సెప్టెంబర్ 7, 
రెడ్ల పార్టీ వైసీపీ, కమ్మల పార్టీ టీడీపీ అని ఎవరు చెప్పారు. కులాల మధ్య పార్టీలను రాజకీయాలను విభజించే అతి తెలివి ఎవరికి పుట్టిందో కానీ అది తప్పు అని చాలాసార్లు రుజువు అయింది. ఎక్కడ లాభం ఉంటుందో అక్కడికి నేతాశ్రీలు చేరుతారు. వైసీపీ వైపు కమ్మలు వచ్చినా టీడీపీ వైపు రెడ్లు పరుగులు తీసినా కూడా అదంతా వారి సొంత స్వార్ధం తప్ప మరోటి కాదు. ఇపుడు చూస్తే జగన్ సొంత జిల్లా కడపలో ఒక రెడ్డి గారు టీడీపీ వైపు మెల్లగా జారాలని చూస్తున్నారు. ఆయనది అసలే జమ్మలమడుగు, ఆయన వైసీపీ రాజకీయాల్లో తాను అట్టడుగు అనుకుంటున్నారుట. అందుకే సైకిల్ ఎక్కేస్తే పోలా అని ఆలోచిస్తున్నారుట. జమ్మలమడుగులో డాక్టర్ సుధీర్ రెడ్డి ఆపరేషన్ స్పీడ్ గా సాగుతోంది. ఆయన వృత్తి వైద్యం, అందుకే ఎక్కడ రోగమున్నా కడిగేస్తూ కట్టు కట్టేస్తూ పోతున్నారు. పైగా ఆయనది కూడా రాజకీయ కుటుంబమే. మాజీ మంత్రి మైసూరారెడ్డి తమ్ముడు కొడుకు కావడమే కాదు, జగన్ అంటే బాగా ఇష్టపడే మనిషి. దాంతో ఆయన్ని కదల్చడం అంటే కష్టసాధ్యమే. గత ఎన్నికల్లో ఆయనకు భారీ మెజారిటీ దక్కింది. దానికి తోడు టీడీపీ నుంచి వైసీపీలోకి దూకినా రామ సుబ్బారెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదు. దీంతో ఆయన ఉండలేకపోతున్నారుట. తొందరలోనే సొంత పార్టీ వైపుగా మూటా ముల్లె సర్దేస్తారు అంటున్నారు. ఇక్కడ రామసుబ్బారెడ్డి స్పీడ్ కి ఒక కారణం కూడా ఉంది. జమ్మలమడుగులో బలమైన నేతగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఉన్నారు. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయినా ఎన్నికల వేళకు తిరిగి టీడీపీ వైపు వచ్చినా వస్తారు. దాంతో ఆయన కంటే ముందే పసుపు శిబిరంలో దూరిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కి ఠికానా ఉంటుంది అన్నది రెడ్డి గారి బుర్రలో పాదరసం లాంటి పుట్టిన ఆలోచనట. అందుకే ఆయన ఈ మధ్య వైసీపీ అంటే కస్సుమంటున్నారు. ఆ పార్టీ కార్యక్రమాలకు కూడా వెళ్లడంలేదు. అన్నిటా ఆమడదూరం పాటిస్తున్నారు.ఇక వైసీపీ నేతలు కూడా అదే కోరుకుంటున్నారు. రామసుబ్బారెడ్డి వున్నా పోయినా తమకేమీ లోటు లేదు అనే అంటున్నారు. ఆయన ఏ రోజూ మనస్పూర్తిగా పార్టీతో కలసి ప్రయాణించలేదు అంటున్నారు. ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాటుపడ్డారని అంటున్నారు. ఇపుడు కూడా టికెట్ దక్కదనే పోతున్నారు తప్ప మరోటి కాదని కూడా తేల్చేస్తున్నారు. ఆయన టీడీపీలో చేరి పోటీ చేసినా మళ్లీ ఇక్కడ గెలిచేది వైసీపీయేనని ఢంకా భజాయిస్తున్నారు. మొత్తానికి జగన్ చేరదీసినా కూడా రామసుబ్బారెడ్డి పసుపు పరవశంతో ఉన్నారు. అందుకే ఆయన వెళ్ళనీ అంటున్నారు. ఇక రెడ్డి గారి జంపింగ్ కి ముహూర్తమే తరువాయి అని కూడా చెబుతున్నారు.

Related Posts