శ్రీ రామనామ స్మరణతో పులకించిన వసంత మండపం
- శ్రీరామ జనన సర్గల పారాయణం
- ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో శాస్త్రోక్తంగా జప-తర్పణ-హోమాలు
తిరుమల,మా ప్రతినిధి,సెప్టెంబర్ 07
లోక సంక్షేమం కోసం, కరోనా మూడవ వేవ్ నుండి చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల వసంతమండపంలో సెప్టెంబరు 3వ తేదీ నుండి టిటిడి నిర్వహిస్తున్న" షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష " కార్యక్రమంలో భాగంగా 5వ రోజైన మంగళవారం శ్రీరామ జనన సర్గల పారాయణం జరిగింది.
బాలకాండలో " బభౌరామఃసంప్రహృష్టఃసర్వదైవతైః " అనే 16 అక్షరాల వాక్యం విశిష్టమైనది. ఇందులో 5వ రోజు " సం " అనే అక్షరానికి ఉన్న బీజాక్షరాల ప్రకారం బాలకాండలోని 15వ సర్గ నుండి 21వ సర్గ వరకు ఉన్న 230 శ్లోకాలను పారాయణం చేశారు. ఇందులో భాగంగా మొదట సంకల్పంతో ప్రారంభించి శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన చేశారు. ఆ తరువాత 16 మంది ఉపాసకులు శ్లోక పారాయణం చేశారు. కాగా బాలకాండలోని మొత్తం 77 సర్గల్లో 2,232 శ్లోకాలు ఉన్నాయి.
ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని పర్యవేక్షణలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు రామకృష్ణ సోమయాజి శర్మ, పివిఎన్ఎన్ మారుతి పారాయణ కార్యక్రమం నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఆకట్టుకున్న సెట్టింగులు :
శ్రీరామ జనన సర్గల పారాయణం సందర్భంగా టిటిడి ఏర్పాటు చేసిన సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఊయ్యలలో బాల శ్రీ రామచంద్రమూర్తి, ఇరువైపుల శ్రీ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ మహావిష్ణువులను ఏర్పాటు చేశారు.
రామ జనన కీర్తనతో పులకించిన వసంత మండపం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తెలుగు వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామివారు రచించిన శ్రీరామ జనన కీర్తనను తిరుపతికి చెందిన ప్రముఖ గాయని డా.ఆముక్తమల్యాద సుషణ బృందం " రామ శ్రీ రామ లాలి ఊగుచు ఘన శ్యామా నేను బ్రోవు లాలి ........" కీర్తనను సుమధురంగా ఆలపించారు.