చెంచాలతో ఓ సొరంగాన్ని తవ్వి.. బయటపడ్డ ఖైదీలు
జెరుసలెం సెప్టెంబర్ 7
అది ఇజ్రాయెల్‌లోనే అత్యంత భద్రత ఉండే జైలు. చీమ చిటుక్కుమన్నా అక్కడి అధికారులకు తెలిసిపోతుంది. అలాంటి జైలు నుంచి ఆరుగురు పాలస్తీనా ఖైదీలు పారిపోయారు. అది కూడా ఎలాగో తెలుసా? తమ దగ్గర ఉన్న తుప్పు పట్టిన చెంచాలతో ఓ సొరంగాన్ని తవ్వి.. అందులో నుంచి బయటపడ్డారు. ఇప్పుడా ఖైదీల కోసం ఇజ్రాయెల్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.పారిపోయిన ఆరుగురు ఖైదీల్లో ఐదుగురు ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన వాళ్లు కాగా.. ఒకరు అల్-అక్సా మార్టిర్స్ బ్రిగేడ్ నాయకుడు. వీళ్లంతా గిల్బోవా జైల్లో ఒకే సెల్‌లో ఉండేవారు. అందులో ఉన్న ఓ సింక్‌ను ఆధారంగా చేసుకొని భారీ సొరంగం తవ్వి పారిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు. సాధారణంగా ఇజ్రాయెల్ జైలు నుంచి పాలస్తీనా ఖైదీలు పారిపోవడం అంత సులువు కాదు. అత్యంత అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెనెట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జైలు గది డిజైన్‌లో ఉన్న లొసుగులను వాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని ఈ సొరంగం తవ్వినట్లు ఇజ్రాయెల్ జైళ్ల శాఖ కమిషనర్ కేటీ పెర్రీ వెల్లడించారు. జైలు గోడల వెనుక ఉన్న ఖాళీ ప్రదేశం ఈ ఖైదీలకు ఉపయోగపడింది. వాళ్లు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఈ పని చేశారని, బయటి వాళ్ల సహకారం కూడా ఇందులో ఉండొచ్చని జైలు అధికారులు చెప్పారు. ఈ ఘటన తర్వాత జైల్లోని మిగతా 400 మంది ఖైదీలను మరో జైలుకు తరలించారు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు.. ఇప్పటికే పాలస్తీనీయులకు ఎంతో కొంత పట్టు ఉన్న జెనిన్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు.
ఓ చెంచాతో కొన్ని నెలల పాటు శ్రమించి వాళ్లు ఈ సొరంగం తవ్వినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఆ తుప్పు పట్టిన చెంచా ఎవరికీ కనిపించకుండా.. జైలు గదిలోని ఓ ఫొటో వెనుక దాచారు. పారిపోయిన వాళ్లలో నలుగురు ఖైదీలు జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నారు.