ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు
అమరావతి
ఉపాధి హామీ పధకం బిల్లులు చెల్లించక పోవడంతో ప్రభుత్వంపై ఎపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 15వ తేదీ లోపు చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని న్యాయమూర్తి జస్టీస్ బట్టు దేవానంద్ హెచ్చరించారు. రెండు వారాల క్రితం 494 కేసులలో చెల్లింపులు చేయమని ఆదేశిస్తే.. కేవలం 25కేసులలోనే చెల్లింపులు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్పంచ్ ఎకౌంట్లోకి వేస్తే వారు కాంట్రాక్టర్ కి చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దాంతో న్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ వారి వివరాలు ఇస్తే.. వారిపై కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ కొన్ని కేసులలో విచారణ జరుగుతుందని చెప్పారు. విచారణ చేయకుండానే.. జరుగుతుందని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటీషనర్ తరపు న్యాయవాదులు విన్నవించారు. రెండున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు విచారణ ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ చేపడితే పిటీషనర్లకు నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించింది. రెండున్నర సంవత్సరాల పాటు చెల్లింపులు నిలిపి వేస్తే వారి జీవనాధారం ఏమిటని ప్రశ్నించింది. ఇరవై నుంచి ముప్పై శాతం చెల్లింపులలో కట్ చేయడం పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈనెల 15వ తేదీ నాటికి ఎవరికి ఎంత మొత్తం చెల్లించారో పిటీషనర్, ప్రభుత్వం రెండూ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈనెల 15వ తేదీన చెల్లింపులు జరగకపోతే నేరుగా కోర్టు ధిక్కార చర్యలు, పిటీషనర్ల వారీగా చేపడతామని హెచ్చరించింది. ప్రతిసారీ వాయిదా అడుగుతూ జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.