YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పార్టీలో కొత్త వివాదానికి జానా తెర

పార్టీలో కొత్త వివాదానికి జానా తెర

కాంగ్రెస్ పార్టీలో కొంచెం ప్రజాస్వామ్యం ఎక్కువ‌.. సీనియ‌ర్ నేత‌ల విష‌యంలో మాత్రం ఇది మ‌రింత ఎక్కువే.. ఎప్పుడు ఎవ‌రేం మాట్లాడుతారో.. ఏ వివాదానికి తెర‌లేపుతారో ఎవ‌రికీ అంతుబ‌ట్టదు.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ప్రజాచైత‌న్య బ‌స్సుయాత్రతో నేత‌లు మాంచి ఉత్సాహం మీద ఉన్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా నూత‌నొత్తేజం క‌నిపిస్తోంది. నేత‌లంద‌రూ కూడా స‌మ‌న్వయంతో, క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ్తున్నార‌న్న భావన ప్రజ‌ల్లో క‌లుగుతోంది. కాంగ్రెస్ నేత‌లంద‌రూ కూడా క‌లిసి ముందుకు వెళ్లడంపై అధికార టీఆర్ఎస్ కూడా కొంత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నట్లు స‌మాచారం. ఇప్పటికే తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో రెండు విడ‌త‌లుగా చేప‌ట్టిన ప్రజాచైత‌న్య బ‌స్సుయాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా రాష్ట్ర నేత‌ల‌ను అభినందించారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత తాను కూడా యాత్రలో పాల్గొంటాన‌ని హామీ ఇచ్చారు.మరో వైపు మూడో విడ‌త బ‌స్సుయాత్రకు స‌న్నద్ధమ‌వుతున్న త‌రుణంలో సీఎల్పీ నేత జానారెడ్డి కీల‌క వ్యాఖ్యలు చేశారు. పార్టీలో వివాదానికి తెర‌లేపారు. తన సహజ శైలికి భిన్నంగా మీడియాతో మనసువిప్పి మాట్లాడారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన .. చాలా కీల‌క విష‌యాల‌పై స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం పదవికి తనకంటే అర్హులెవరూ లేరనీ, సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ ఇప్పించింది తానేనని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టేందుకూ సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. గతంలో పీసీసీ ఇవ్వకపోయినా పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే మౌనంగా ఉన్నట్టు జానారెడ్డి వివరించారు. ప్రజా చైతన్య బస్సుయాత్ర మూడో విడత ఈనెల 13నుంచి ప్రారంభం కానుంది. ఆరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాలలో జరిగే బహిరంగ సభతో ప్రారంభమయ్యే యాత్ర 17వ తేదీన బెల్లంపల్లిలో జరిగే బహిరంగ సభతో పూర్తవుతుంది. 13న మంచిర్యాలలో బహిరంగ సభ అనంతరం రాత్రికి రామగుండంలో బస చేస్తారు. 14న చెన్నూరులో సభ నిర్వహించి రాత్రికి రామగుండంలో బస చేస్తారు. 15న కాగజ్‌ నగర్‌, 16న ఆసిఫాబాద్‌, 17న బెల్లంపల్లిలో సా. 5గంటలకు సభలు నిర్వహిస్తారు. అయితే జానారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు బ‌స్సుయాత్ర‌పై ప్ర‌భావం చూపుతాయ‌నే టాక్ వినిపిస్తోంది.సీఎల్పీ సరిగా పనిచేయడం లేదన్న ప్రచారంపైనా కూడా త‌న‌దైన శైలిలో స్పందించారు. క్రికెట్‌ టీమ్‌లో లీడర్‌ సెంచరీలు కొట్టినా అన్ని సార్లు మ్యాచ్‌ గెలవలేరు… టీమ్‌ మెంబర్స్‌ ప్రదర్శన బాగుంటే లీడర్‌ పది రన్‌లు కొట్టినా మ్యాచ్‌ గెలవవచ్చన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి ఎంతో మందికి తానే రాజకీయ దారులు చూపించినట్లు చెప్పిన జానా.. ఏనాడూ తాను గొప్పలు చెప్పుకోలేదని అన‌డం గ‌మ‌నార్హం.

Related Posts