శ్రీకాకుళం, సెప్టెంబర్ 8,
ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయి. దానికి మంత్రి వర్గ విస్తరణ నాంది కాబోతోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న వైసీపీ రాజకీయం గేర్ మార్చేందుకు ఈ విస్తరణే మార్గం అవుతుంది అంటున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రా జిల్లాల్లో వెనకబడిన శ్రీకాకుళం జిల్లాలో మంత్రి వర్గ విస్తరణ వల్ల ఎవరికి మేలు, ఎవరికి చేటు అన్న ప్రశ్న ఒకటి తలెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. ఆయనను వైఎస్సార్ ఎంతో గౌరవించి ఆదరించారు. జగన్ మాత్రం పక్కన పెట్టారు. అయితే విస్తరణలో తమ నాయకుడికి మంత్రి పదవి ఖాయమని ఒక వైపు ధర్మాన ప్రసాదరావు అనుచరులు హల్ చల్ చేస్తున్నారు. కానీ వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ధర్మానకు మంత్రి పదవి ఈసారి కూడా ఇవ్వరు అంటున్నారు.ధర్మాన ప్రసాదరావు సీనియర్ లీడర్ కాబట్టి ఆయన్ని గౌరవించి రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని అప్పగిస్తారు అంటున్నారు. శాసనసభను సమర్ధంగా నిర్వహించే సత్తా ఆయనకే ఉందని కూడా జగన్ నమ్ముతున్నారుట. దీని వల్ల ఆయనకు ఆ కీలకమైన పదవి ఇస్తే న్యాయం చేసినట్లు ఉంటుంది, క్యాబినెట్ లో తీసుకోకుండానే తగిన హోదా ఇచ్చినట్లు ఉంటుందని జగన్ కొత్త ఆలోచన చేస్తున్నారుట. అలాగే ఇదే జిల్లాకు మరోసారి స్పీకర్ పదవి కట్టబెట్టి గుర్తింపు ఇచ్చామని చెప్పుకోవడానికి కూడా వీలు అవుతుందని కూడా భావిస్తున్నారుట. మొత్తానికి జగన్ ఆలోచనల మేరకు ధర్మాన ప్రసాదరావుకు పదవి దక్కుతుంది కానీ అది మంత్రి పదవి కాదు అనే ప్రచారం సాగుతోంది.
ఇక శ్రీకాకుళం రాజకీయాలలో తలపండిన తమ్మినేని సీతారాం ని క్యాబినేట్ లో తీసుకుంటారని అంటున్నారు. తనకు లాస్ట్ చాన్స్ అని ఆయన జగన్ వద్ద మొర పెట్టుకున్నారు. దానికి కరిగిన జగన్ పెద్దాయనను మంత్రిని చేయాలని, తద్వారా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న కాళింగులకు న్యాయం చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఆయన కోసమే జగన్ మార్పులు చేర్పులు కూడా ఇదే జిల్లాలో పెద్ద ఎత్తున చేస్తున్నారు అని కూడా చెబుతున్నారు. ఇదే జిల్లాలో ఉన్న బీసీ మంత్రి సీదరి అప్పలరాజుని తప్పించి తమ్మినేని కి మంత్రి కిరీటం పెడతారు అని అంటున్నారు. ఒక విధంగా ఈ సమీకరణల వల్ల బీసీలకు, ధర్మాన ప్రసాదరావు ఫ్యామిలీకి న్యాయం చేస్తున్నామని జగన్ సందేశం ఇస్తారరట.ఇక ధర్మాన క్రిష్ణ దాస్ ని మంత్రి పదవి నుంచి తప్పించడం కూడా ఖాయమే అంటున్నారు. ఎందుకంటే తమ్ముడికి అన్నకీ కూడా పదవులు ఇవ్వరు కాబట్టి. కానీ ఉప ముఖ్యమంత్రి లాంటి కీలకమైన స్థానంలో ఉన్న క్రిష్ణ దాస్ ని తప్పిస్తే ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అన్న డిమాండ్ వస్తోంది. కేవలం రాజ్యంగబద్ధ పదవి అయిన స్పీకర్ కుర్చీలో ప్రసాదరావుని కూర్చోబెట్టి జిల్లా రాజకీయాన్ని అంతా తమ్మినేనికి అప్పగిస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతుందని వైసీపీ లో ధర్మాన వర్గం హెచ్చరిస్తోంది. ఇక ధర్మాన ప్రసాదరావు కూడా తీసుకుంటే మంత్రి పదవి లేకుంటే లేదు అన్నట్లుగా ఉంటారా, లేక జగన్ చెప్పినట్లుగా స్పీకర్ కుర్చీలో ఆసీనులు అవుతారా అన్నది కూడా చూడాలి.