YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పీకే పై ఆచితూచి అడుగులు

 పీకే పై  ఆచితూచి అడుగులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8, 
కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరికపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రశాంత్ కిషోర్‌ను చేర్చుకునే ప్రతిపాదనను ఆ పార్టీలోని  జీ23 నేతలు వ్యతిరేకిస్తుండగా.. మరొకొందరు సపోర్ట్ చేస్తున్నారు. పార్టీలో సమూల ప్రక్షాళన చేపట్టాలని గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాసిన కాంగ్రెస్ సీనియర్ నేతలను జీ23 నేతలుగా పరిగణిస్తుండటం తెలిసిందే. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ నివాసంలో సమావేశమైన జీ23 నేతలు.. ప్రశాంత్ కిషోర్‌ చేరికను వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకునే ప్రతిపాదనను కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ సమర్థించారు. జీ23 నేతల జాబితాలో వీరప్ప మొయిలీ కూడా ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన ప్రశాంత్ కిషోర్ చేరిక ప్రతిపాదనను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.ప్రశాంత్ కిషోర్ చేరికతో పార్టీ నాయకత్వానికి బలం చేకూరడంతో పాటు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. పార్టీకి సాయపడేందుకే ఆయన కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నారని అన్నారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐప్యాక్) వ్యవస్థాపకుడిగా ప్రశాంత్ కిషోర్‌కు సక్సస్ స్టోరీ ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల నిర్మాణం కీలకమన్నారు. కార్యకర్తలే పార్టీకి నిజమైన ఆస్తులుగా పేర్కొన్న వీరప్ప మొయిలీ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు కార్యకర్తల బలంపైనే ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు.
ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు తృణాముల్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకేలకు బాగా అక్కరకు వచ్చాయి. పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకోవడమా? పీకే సారథ్యంలో ప్రత్యేక ప్రచార కమిటీని ఏర్పాటు చేయడమా? అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం తర్జనభర్జనపడుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సమాచారం. 2017 యూపీ ఎన్నికల సమయంలోనూ వారిద్దరూ ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేశారు. నాటి ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని బరిలో నిలవగా.. ఆ ఎన్నికల ఫలితాలు తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. అందుకే పీకే కొన్ని సందర్భాల్లో మాత్రమే సక్సెస్ అవుతున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి ప్రశాంత్ కిషోర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలా? వద్దా? అన్న అంశంపై సోనియాగాంధీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Related Posts