YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రూట్ మార్చిన జనసేన

రూట్ మార్చిన జనసేన

విజయవాడ, సెప్టెంబర్ 8,
ఆంధ్రప్రదేశ్ లో అడక్కుండానే బిజెపి చెంతన చేరి పొత్తు పెట్టుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ఆయన అనుకున్నది ఒకటి అయింది, అవుతుంది మరొకటి. అమరావతి నుంచి, స్టీల్ ప్లాంట్ వరకు కేంద్రంలోని బిజెపి వేస్తున్న అడుగులు జనసేనకు ఉన్న ఓటు బ్యాంక్ కి చిల్లు పడేలాగే నిర్ణయాలు సాగుతున్నాయి. దాంతో తమ దారి తాము చూసుకోవడానికి మంచి ముహూర్తాన్ని పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నట్లు పొలిటికల్ టాక్. వచ్చే ఎన్నికల నాటికి టిడిపి తో పొత్తు పెట్టుకునే రంగంలోకి దిగాలని దీనికి బిజెపి కలిసి వచ్చినా లేకపోయినా వ్యూహాత్మకంగా సాగాలన్న ఎత్తుగడలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో బిజెపి తో జనసేన ఎడమొహం పెడమొహం గానే సాగుతుంది. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల తరువాత కమలానికి, జనసేనకు దూరం మరింత పెరిగిందనే అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయకుండా ఇకపై రాజకీయం చేయలేమన్నది పవన్ కళ్యాణ్ కి అనుభవంతో అర్ధమైంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీతో జతకట్టేవారు ఎవరైనా జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో సీట్లు వదిలేసేలా డిమాండ్ పెట్టాలని లిస్ట్ సైతం సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. దీనికోసం ఇప్పటి నుంచి కసరత్తు మొదలు పెట్టింది కవాతు పార్టీ. అందుకే జిల్లాల వారీగా అన్ని ప్రాంతాలతో కమిటీలు వేయడం వేగంగా పూర్తి చేస్తుంది జనసేన. కీలకమైన స్థానాలు, నమ్ముకున్న పార్టీలోని నేతలకు న్యాయం జరిగేలా కొందరికి టికెట్ పై హామీ కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చేశారని అంటున్నారు.నాయకులు, క్యాడర్ పనితనాన్ని బట్టి వారికి అన్ని విధాలా పదోన్నతులు ఇవ్వాలని అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని చెబుతున్నారు. కొందరిని ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని ఇప్పటికే చెప్పారని తెలుస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు రాయలసీమ లోని కొన్ని నియోజవర్గాలు ఉత్తరాంధ్ర లో తమకు పట్టున్న ప్రాంతాలపై జనసేన ఫోకస్ పెంచినట్లు సమాచారం. కనీసం వచ్చే ఎన్నికల లోగా 50 స్థానాల్లో గట్టి పట్టు సాధించాలన్నది ఆ పార్టీ వ్యూహంగా ఉంది. తద్వారా ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతామని పార్టీని బతికించుకునే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ ఆలోచన అంటున్నారు రాజకీయ నిపుణులు. ప్రజా సమస్యలపై ఇక మీదట చురుగ్గా ఉద్యమించే క్యాడర్ ను ప్రోత్సహిస్తూ వారిలో జోష్ పెంచడానికి అధిష్టానం చర్యలు మొదలు పెట్టింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల యుద్ధం నాటికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలన్న జనసేన కలలు ఏమేరకు నెరవేరతాయో చూడాలి.

Related Posts