మోడీ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి. బీజేపీకి ఉప ఎన్నికల రూపంలో మరో అగ్నిపరీక్ష ఎదురవుతోంది. ఇక నుంచి బీజేపీకి ఏ చిన్న అవకాశమూ ఇవ్వొద్దన్న లక్ష్యంతో ప్రతిపక్షాలు ముందుకు వస్తున్నాయి. వాటిమధ్య ఉన్న బేధాలు, విభేదాలను పక్కనబెట్టి కమలదళాన్ని మట్టికరిపించేందుకు పావులు కదుపుతున్నాయి.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మోడీ నాయకత్వానికి, బీజేపీ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కర్ణాటకలో మళ్లీ సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి అవుతారని పలు ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ ఎలాగైనా గెలిచి వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలని కమలదళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. అగ్రనేతలందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మొదలు ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వరకు ప్రచారం చేపట్టారుఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ, నూర్పూర్ అసెంబ్లీ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేతలు హుకుమ్‌సింగ్, లోకేంద్ర సింగ్ మరణించడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇటీవల జరిగిన గోరఖ్‌పూర్, పూల్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, కైరానా, నూర్పూర్‌లోనూ బీజేపీ విజయం సాధించకుండా చూడాలని రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్‌డీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నిర్ణయించాయి. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్, ఆర్‌ఎల్‌డీ ఉపాధ్యక్షుడు జయంత్ చౌదరి సుదీర్ఘంగా ఈ విషయంపై చర్చించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో గోరఖ్‌పూర్, ఫూల్పూర్ పార్లమెంటు నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో మాదిరిగానే ఈ నెల 28న జరిగే ఉప ఎన్నికల్లోనూ బీజేపీని చిత్తు చేసేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి.కైరానాలో ఎస్పీ, నూర్పూర్‌లో ఆర్‌ఎల్‌డీ పోటీ చేయాలని ఆ పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది. అలాగే ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలపాలని చూస్తున్నాయి. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లోనూ, 2019లోక్ సభ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఎస్పీతో కలిసి పనిచేస్తుందని ఆర్ఎల్డీ నాయకులు పేర్కొనడం గమనార్హం. అయితే ప్రస్తుతం తాము ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి స్పష్టం చేశారు. కాగా, ఎస్పీ, బీఎస్పీల పొత్తు ఈ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని ఎస్పీ నేతలు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ కూడా ఈ పార్టీలతో కలిసినడిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మోడీ వ్యతిరేక కూటమిని నాయకత్వం వహించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయదనే టాక్ వినిపిస్తోంది.కర్ణాటక ఫలితాలు ఈనెల 28న ఉత్తరప్రదేశ్‌లోని హైరానా, నూర్పూర్ ఉప ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేగాకుండా ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, సిక్కిం తదితర రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాలకు గాను 71 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.ప్రధాని మోడీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో బీజేపీ క్రమంగా ప్రజల్లో ఆదరణ కోల్పోతోంది. గోరఖ్‌పూర్, పూల్పూర్ ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని పలువురు నాయకులు అంటున్నారు.కాగా, ఇటీవల ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఉన్నావ్‌లో బాలికపై బీజేపీ ఎమ్మెల్యే లైంగికదాడి ఆరోపణలు, దళితులకు దగ్గరయ్యేందుకు చేపట్టిన దళితగోవిందం కార్యక్రమం సందర్భంగా మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. ముఖ్యమంత్రి యోగిపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల మధ్య వస్తున్న ఉప ఎన్నికల్లో విపక్షాలు ఏకమవడంతో బీజేపీ గెలవడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే గత ఎన్నికల్లో మోడీని పీఎం చేయడంలో కీలకపాత్ర పోషించిన యూపీలో బీజేపీకి దిమ్మతిరగడం ఖాయంగా కనిపిస్తోంది.