తిరుపతి
గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తిరుపతి అర్బన్ ఎస్పీ సి హెచ్ వెంకట అప్పలనాయుడును ఆశ్రయించారు. ప్రేమజంట కథనం మేరకు.... నెల్లూరు జిల్లా వేదయ్యపాలెం కు చెందిన మధుసూదన్ రావు, పుష్ప దంపతుల కుమార్తె శ్రీ వాణి, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం వియ్యం పల్లి కి చెందిన మస్తాన్ రాజమ్మ దంపతులకు కుమారుడు సాయి తేజ ఇరువురు తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. కావలి వద్ద ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని తమ కుటుంబానికి తెలియజేశారు. అమ్మాయిది కమ్మ కులం అబ్బాయిది దళిత కులం కావడంతో శ్రీ వారి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. విధిలేని పరిస్థితిలో ఇద్దరు ఇంటి నుండి పారిపోయి కరీంనగర్ జిల్లాలో జూలై 7వ తేదీన వివాహం చేసుకున్నారు. గత నెలలో అమ్మాయి తల్లిదండ్రులు శ్రీ వాణికి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మరో పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడటంతో పోలీసుల సహాయంతో తిరిగి భర్త సాయి తేజ వద్దకు చేరుకుంది. తమ మాట కాదని పెళ్లి చేసుకున్న ఇరువురిని అంతమొందించాలని అమ్మాయి కుటుంబ సభ్యులు బంధువులు తమపై దాడులకు దిగుతున్నారని, మాకు రక్షణ కల్పించాలని హాజరుకావాల్సిందిగా కోరారు. అర్బన్ పోలీసులు వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.