న్యూయార్క్ సెప్టెంబర్ 8
సరిహద్దుల్లో హింసా సంస్కృతిని కొనసాగిస్తున్న పాకిస్థాన్ ఐక్యరాజ్య సమితి వేదికగా పాక్ పై తీవ్రంగా మండి పడ్డ భారత్
ఐక్యరాజ్య సమితి వేదికగా మరోసారి దాయాది పాకిస్థాన్ దుర్బుద్ధిని ఎండగట్టింది భారత్. ఈ విశ్వ వేదికను ఇండియాపై విద్వేషాన్ని ప్రదర్శించడానికి పాక్ పదేపదే ఉపయోగించుకోవడంపై తీవ్రంగా మండిపడింది. తన ఇంట్లో, సరిహద్దుల్లో హింసా సంస్కృతిని కొనసాగిస్తున్న పాకిస్థాన్.. ఇలాంటి వేదికలపై మాత్రం శాంతి వచనాలు వల్లె వేస్తోందని ఐక్యరాజ్య సమితిలో ఇండియా ప్రతినిధి విదిశా మైత్రా చాలా ఘాటుగా సమాధానమిచ్చారు.యూఎన్‌లో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్ముకశ్మీర్ అంశాన్ని, వేర్పాటువాద నేత సయ్యద్ గీలానీల గురించి ప్రస్తావించడంపై భారత్ ఇలా తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వేదికలపై శాంతి మంత్రాలు పటించడం కాదు. అంతర్జాతీయ సంబంధాలు, సభ్య దేశాల మధ్య ఆ శాంతిని నెలకొల్పాలి అని పాకిస్థాన్‌కు సూచించారు విదిశా మైత్రా. ఇండియాపై విద్వేషాన్ని ప్రదర్శించడానికి మరోసారి యూఎన్ వేదికను పాకిస్థాన్ ఎలా వాడుకుందో మనం చూశాం. కానీ ఆ దేశం మాత్రం ఇప్పటికీ తన ఇంట్లో, తన సరిహద్దుల వెంబడి హింసా సంస్కృతిని కొనసాగిస్తోంది. పాక్ చేస్తున్న ఇలాంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని విదిశా అన్నారు.ఇలాంటి చర్యలను సమర్థించుకోవడానికి మతాన్ని వాడుకుంటున్న ఉగ్రవాదులను, వాళ్లకు మద్దతిస్తున్న వాళ్లను చూసి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ఇండియా ఇక మీదట కూడా మానవత్వం, ప్రజాస్వామ్యం, అహింసను ప్రోత్సహిస్తుందని ఆమె అన్నారు.