బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు దాడి
కోల్‌కతా సెప్టెంబర్ 8
పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు దాడి జరిగింది. కోల్‌కతా సమీపంలోని ఆ ఎంపీ ఇంటి ముందు ఇవాళ మూడు బాంబులను విసిరారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ స్పందించారు. ఆయన తన ట్విట్టర్‌లో బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించిన అంశాన్ని పోస్టు చేశారు. ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘటన జరిగిందని, ఇది ఆందోళనకరంగా ఉందని గవర్నర్ ట్వీట్ చేశారు. ఎంపీ ఇంటి ముందు బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడింది తృణమూల్ కాంగ్రెస్ అని బీజేపీ ఆరోపిస్తున్నది.నార్త్ 24 పార్గనాస్ వద్ద ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి వద్ద ప్రస్తుతం భద్రతా దళాలను మోహరించారు. జగత్దల్ వద్ద ఉన్న ఇంటి ముందు బాంబు దాడి జరిగింది. కోల్‌కతాకు వంద కిలోమీటర్ల దూరంలో జగత్దల్ ఉంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు బాంబులు విసిరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 6.30 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. పేలుళ్ల వల్ల ఎంపీ ఇంటి ముందు గేట్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ .. హుటాహుటిన కోల్‌కతాకు పయనమయ్యారు.