YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫెడరల్ ఫ్రంట్ కు టీ కాంగ్రెస్ పుల్లలు

ఫెడరల్ ఫ్రంట్ కు టీ కాంగ్రెస్ పుల్లలు

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ఇరుపార్టీల నేత‌లు మాట‌ల యుద్ధాల‌కు దిగుతున్నారు. ఇక కేసీఆర్ ఫ్రంట్ విష‌యంలో మాత్రం కాంగ్రెస్ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారు. ఫ్రంట్ విష‌యంలో కేసీఆర్ వైఖ‌రిపై ఆయా పార్టీల‌కు లేఖ‌లు రాసే ప‌నిలో ప‌డ్డారు. కేవ‌లం రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల నుంచి ప్రజ‌ల‌ను ప‌క్కదారి ప‌ట్టించేందుకే సీఎం కేసీఆర్ ఫ్రంట్ నాట‌కం ఆడుతున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.కేసీఆర్‌ మూడో కూటమి కుట్రపై దేవేగౌడ, మాయావతి, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్‌, అఖిలేష్‌ యాదవ్‌, హేమంత్‌ సోరెన్‌, స్టాలిన్‌ తదితరులకు లేఖలు రాసినట్లు చెప్పారు. అసమర్థ పాలన, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ నాటకానికి తెర తీశారని ఆయ‌న‌ ఆరోపించారు.ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌పై స్పందించిన డీఎంకే ఎంపీ కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీని వదులుకునే ఆలోచనే లేదని, ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందని ఆమె తేల్చి చెప్పారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్‌కు దూరం జరగబోమని కనిమొళి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గ‌తంలో కూడా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత హ‌నుమంత‌రావు.. ఢిల్లీలో మ‌మ‌తాబెన‌ర్జీని క‌లిసి కేసీఆర్‌తో జాగ్రత్త అంటూ చెప్పిన‌ట్లు అప్పట్లో ప్రచారం జ‌రిగింది. అయితే టీపీసీసీ నేత‌లు రాసిన లేఖ‌ల ప్రభావంతోనే క‌నిమొళి ఇలా అన్నారనే ప్రచారం జరుగుతోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ కేవ‌లం యూపీయే భాగ‌స్వామ్యప‌క్షాల‌ను మాత్రమే క‌లుస్తున్నార‌నే విమ‌ర్శలు ఉన్నాయి. అయితే జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా, ప్రాంతీయ పార్టీలతో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుచేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ప్రయ‌త్నం చేస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల నాయకులను ఆయన కలుస్తూ వచ్చారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ‌ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ, క‌ర్ణాక‌ట వెళ్లి జేడీఎస్ నేత‌లు దేవేగౌడ, కుమారస్వామిని ఆయ‌న క‌లిశారు. కేసీఆర్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేత‌లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా కేసీఆర్ వ్యవ‌హార శైలిని ముందుకు తెస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేత దాసోజు శ్రవ‌ణ్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భ్రాంతి రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

Related Posts