YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

కమలం గూటికి మాజీ జేడీ.?

కమలం గూటికి మాజీ జేడీ.?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్ఠానం ఎందుకింత సస్పెన్స్ కొనసాగిస్తోంది? ఆ బాధ్యతలను ఎవరి భుజాలపై ఉంచాలో అర్థం కాకనా.. లేదా వ్యూహాత్మకంగానే కాలయాపన చేస్తోందా అన్న విషయం అర్థం కాక రాజకీయ పండితులు కూడా తలపట్టుకుంటున్నారు.సార్వత్రిక ఎన్నికల సంవత్సరమైన 2019 కాకుండా 2024 నాటికి ఏపీలో పార్టీకి బలమైన పునాదులు ఏర్పరిచే ఆరేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేసేందుకు వీలుగా.. ‘ఆయన’ కాషాయధారుడై కమలం చెంత చేరనున్నారని పార్టీలోని ఒక వర్గం బలంగా నమ్ముతోంది. విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబుతో పార్టీ అధ్యక్ష పదవికి హడావిడిగా రాజీనామా చేయించిన అధిష్ఠానం.. కొత్త అధ్యక్షుడి నియామకంపై ఇంత సాచివేత ధోరణి అవలంబించడానికి బలమైన కారణాలే ఉన్నాయని పార్గీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఇప్పటివరకు తెరమీదకు వచ్చిన నాయకులెవరూ కాకుండా.. ఒక అజ్ఞాతవాసికి పగ్గాలు అప్పగించేందుకే అధిష్ఠానం వేచి చూసే ధోరణి అవలంబిస్తోందన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. ఏపీలో అనుసరించాల్సిన వ్యూహంపై అధిష్ఠానం స్పష్టమైన వైఖరితోనే ఉందని, ఈ నెలాఖరు కల్లా పార్టీలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయని అధిష్ఠానం పెద్దలకు దగ్గరగా ఉండే పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీపై బీజేపీ అధిష్ఠానం అనుసరిస్తున్న వైఖరి ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న భావన పార్టీ శ్రేణుల్లో బలపడుతోందని ఒక వర్గం అంటోంది. రాను రాను ఇది అసహనానికి దారితీసి పార్టీకి నష్టం చేసే ప్రమాదం ఉందని వారి భావన. పార్టీ కొత్త అధ్యక్షుడిని వెంటనే నియమించే ఉద్దేశం లేకపోతే అసలు కంభంపాటి హరిబాబుతో అంత హడావుడిగా రాజీనామా చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని వాదిస్తున్నారు. ఏపీకి తీరని ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని అధికార తెలుగుదేశం చిత్రీకరిస్తున్నా ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడమే కాక.. ఆ దిశగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడంలో కూడా పార్టీ అధిష్ఠానం ఘోరంగా విఫలమైందన్న భావవ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హరిబాబును పదవి నుంచి తప్పించటం ఏ మాత్రం ఇష్టం లేని వర్గం అధిష్ఠానంపై లోలోపల కారాలు మిరియాలు నూరుతోంది. మరో వైపు.. తెలుగుదేశంతో అంటకాగే స్థితి నుంచి సొంత అస్తిత్వంతో పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న వర్గం కూడా డీలా పడిందనే చెప్పాలి. పైడికొండల మాణిక్యాలరావు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, కన్నా లక్ష్మీ నారాయణలను తెరమీదకు తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో మీడియాకు లీకులిచ్చి ఆ తరువాత మౌనవ్రతం పాటించటం పట్ల ఆ వర్గంలోనూ అంతర్గతంగా అసంతృప్తి రాజుకుంటోంది. కన్నా లాంటి సీనియర్ నేతలు మరో పార్టీ వైపు చూడటానికి అధిష్ఠానమే ఆస్కారం కల్పించిందన్న అభిప్రాయం కూడా వేళ్ళూనుకుంటోంది. ఆయన ఇప్పటికే ప్రజలను ఏదో ఒక రూపంలో కలుస్తూనే ఉన్నారు.. ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అతి త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వివిధ జిల్లాల్లో ఉన్న గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ..ముఖ్యంగా రైతుల సమస్యలపై దృష్టి పెడుతున్న ఆయన... తన పొలిటికల్ రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. సుమారు రెండున్నర నెలల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్న తర్వాతే తాను రాజకీయ నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఆ తర్వాత అయినా కూడా.. ఆయన కప్పుకోబోయేది కాషాయ జెండాయేనని, ఏపీలో కమల దళపతి ఆయనే అనే ప్రచారం కూడా ఊపందుకుంటోంది. అయితే, లక్ష్మీనారాయణతో అధిష్ఠానం పెద్దలు ప్రాథమిక చర్చలు పూర్తి చేసి పార్టీలోకి ఆహ్వానించినా ఆయన తన ‘మనసులో మాట’ను వెల్లడించలేదని విశ్వసనీయ సమాచారం. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత కమలనాథులు ఏపీపై దృష్టి పెడతారనీ, లక్ష్మీనారాయణను పార్టీలోకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో అధిష్ఠానం ఉందని తెలుస్తోంది. ఈనెల మూడో వారంలో ఈ చర్చలు కొలిక్కి వస్తాయనీ, ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం  కూడా ఏర్పాటవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Related Posts