మరో వివాదంలో బాలినేని
విజయవాడ, సెప్టెంబర్ 8,
విహారం.. వివాదం.. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా టూర్ పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతోంది. పది మంది సన్నిహితులతో కలిసి రష్యా వెళ్లారు మంత్రి. దీనిపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం అప్పుల్లో ఉంటే మంత్రులు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడం ఏంటని ప్రశ్నించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు. ఇదంతా అక్రమ సంపాదనే అని, హవాల్ సొమ్మేనని ఆరోపించారు.అక్రమ సంపాదనతోనే మంత్రి బాలినేని స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లారని ఆరోపించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రంలో పెన్షన్లు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మంత్రులు విలాసాల్లో మునిగితేలుతున్నారని విమర్శించారు. స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లేంత డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. చీమకుర్తి గ్రానైట్ డబ్బులేనని ఆరోపించారు.బాలినేని ఫ్లైట్‌లో ఉన్న ఫొటోను ట్వీట్ చేసి మరీ విమర్శలు చేసింది తెలుగుదేశం పార్టీ. నాయకులు తిరగడానికి ప్రత్యేక విమానాలు, ప్రజలు తిరగడానికి మాత్రం గుంతల రోడ్లా అని విమర్శించింది. రష్యా టూర్‌పై విమర్శలు రావడంతో రియాక్ట్ అయ్యారు మంత్రి బాలినేని శ్రీనివాస్. రష్యా టూర్ తన వ్యక్తిగతమని, స్నేహితులతో కలిసి వచ్చానని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా తనతో ఉన్నారని చెప్పారు. వ్యక్తిగత టూర్లను రాజకీయ వివాదం చేయడం ఏంటని ప్రశ్నించారు బాలినేని