సినిమా టిక్కెట్లపై సర్కార్ కీలక నిర్ణయం
విజయవాడ, సెప్టెంబర్ 8,
సినిమా టికెట్ల విషయంలో జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చేతిలో మొబైల్ ఉంటే చాలు, సినిమా టికెట్ ఉండేలా చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు సినిమా చూడాలంటే టికెట్ కోసం క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. అగ్ర కథానాయకుడి సినిమా అయితే, తెల్లవారుజాము నుంచే థియేటర్ వద్ద పడిగాపులు కాయాల్సిందే. అలాంటి పరిస్థితుల నుంచి డిజిటల్ యుగం మొదలయ్యాక, టికెట్ల కోసం ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్/యాప్‌లు రాకతో ప్రేక్షకుడికి కాస్త ఉపశమనం లభించింది.అయితే, సినిమా టికెట్ల విషయంలో పారదర్శకత కోసం జగన్ సర్కారు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏకంగా ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.సినిమా థియేటర్స్‌లో టికెట్లు విక్రయించే ప్రక్రియను నిశితంగా గమనించిన తర్వాత, రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టమ్ తరహాలో పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి, విధానాలు, అభివృద్ధి, అమలు ప్రక్రియను ప్రభుత్వం నియమించిన కమిటీ చూసుకుంటుంది.’’ అని ఏపీ ప్రభుత్వం జీవోలో తెలిపింది.కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిబంధనల మేరకు చిత్రీకరణలు జరుగుతున్నా, పెద్ద సినిమాలు థియేటర్‌లో విడుదలయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. తెలంగాణ థియేటర్స్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా, ఏపీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో నిర్మాతలు, థియేటర్స్ యజమానులు, పంపిణీదారులు ఏదో రూపంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.