విశాఖపట్టణం, సెప్టెంబర్ 9,
ఆయనకు పదవి ఇలా వచ్చిందో లేదో అలా అరెస్ట్ అయ్యారు. ఆయన ఏడేళ్ళుగా అధికారానికి దూరంగా ఉంటున్నారు. వైసీపీలో చేరినా కూడా ఏ పదవీ దక్కలేదు. ఇన్నాళ్ళకు అధినాయకుడు జగన్ కరుణించి సమున్నతమైన పదవి ఇస్తే పాత కేసులు వెంటాడుతున్నాయి. ఆయన ఎవరో కాదు విశాఖ అర్బన్ జిల్లాకు వైసీపీ ప్రెసిడెంట్ గా ఒకనాడు బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్. ఆయనను జగన్ రాష్ట్ర స్థాయిలో కీలకమైన ఎడ్యుకేషన్ కార్పోరేషన్ కి చైర్మన్ గా నియమించారు. ఆయన కూడా ఇన్నాళ్ళకు ఒక అధికారిక హోదా దక్కింది అని ఆనందించారు. ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక ఈ సంబరం ఇంకా అలా ఉండగానే ఎపుడో ఉన్న పాత కేసులు ఆయన్ని వెంటాడాయి. మళ్ళ విజయప్రసాద్ పూర్వాశ్రమంలో చిట్ ఫండ్ బిజినెస్ చేసేవారు. దాంతో అక్కడ అవకతవకలు జరిగాయన్న దాని మీద ఒడిషా నుంచి వచ్చిన సీఐడి, క్ర బ్రాంచ్ పోలీసులు మళ్ళ విజయ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 36 కోట్లకు పైగా ఆర్ధిక నేరాలకు మళ్ళ పాల్పడినట్లుగా ఒడిషాలో మళ్ళ మీద కేసు నమోదు అయింది. దీంతో విచారణ పేరు మీద ఆయన్ని అరెస్ట్ చేయడంతో విశాఖ వైసీపీ మొత్తానికి షాక్ తగిలినట్లు అయింది. ఇది రాజకీయంగాను సంచలనంగా మారింది.మళ్ళ విజయ ప్రసాద్ 2019 ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక పార్టీ కోసం పనిచేస్తూ ఆర్ధికంగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్న్నారు. ఇపుడిపుడే ఆయన తన బలాన్ని మళ్ళీ పెంచుకుంటున్నారు. తాజాగా ఆయనకు కొత్త పదవి రావడంతో ఆయనకు ఎయిర్ పోర్టు నుంచి నివాసం దాకా పెద్ద సంఖ్యలో క్యాడర్ తరలివచ్చింది. అది చూసిన వారు మళ్ళ విజయ ప్రసాద్ 2024 ఎన్నికలలో గెలిచి తీరుతారు అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గణబాబు కూడా ఇనాయిక్టివ్ కావడంతో మళ్ళకు చాన్స్ దక్కుతుంది అనుకున్నారు. కానీ ఈ కేసులో అరెస్ట్ కావడంతో ఆయన పొలిటికల్ కెరీర్ మీద మాయని మచ్చ పడినట్లు అయిందని అంటున్నారు.విశాఖలోని వైసీపీ నేతలలో కీలకంగా ఉన్న మళ్ల విజయప్రసాద్ కీలకమైన ఆర్ధిక నేరాలకు సంబంధించి అరెస్ట్ కావడం వైసీపీలో చర్చగా ఉంది. మళ్ళ విజయ ప్రసాద్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. ఆయన కేవలం ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. వచ్చే సారి గెలిస్తే రాజకీయంగా ఆయనకు అన్ని అవకాశాలు ఉంటాయి. మరి ఆయన ఈ విధంగా ఇబ్బందులలో పడిపోవడాన్ని చూసి జగన్ టికెట్ ఇస్తారా. ఇచ్చినా జనాలు ఆదరిస్తారా. ప్రత్యర్ధులు దీన్ని సాకుగా చేసుకుని ఆయన్ని ఓడించకుండా ఉంటారా అన్నదే అనుచరుల బాధగా ఉందిట. మొత్తానికి మళ్ళ విజయ ప్రసాద్ రాజకీయ జాతకం శుభం వైపుగా మళ్ళేదెపుడో అంటున్నారు