గుంటూరు, సెప్టెంబర్ 9,
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రాజకీయం ఒక్కసారిగా దూకుడుగా మారింది. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర గత ఎన్నికల్లో కిలారు రోశయ్య చేతిలో స్వల్ప తేడాతో తొలిసారి ఓటమి పాలయ్యారు. ధూళిపాళ్ల నరేంద్ర గతంలో ప్రతిపక్షంలో ఉన్నా నాటి అధికార పక్షంపై గట్టిగా ఎటాక్ చేసేవారు. ఆ తర్వాత గత ఐదేళ్లు అధికార పక్షంలో ఉన్నప్పుడు మాత్రం పూర్తి స్లో అయిపోయారు. ముఖ్యంగా సీనియర్‌ను అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆవేదనతో ఆయన పార్టీని ఏ మాత్రం పట్టించుకోలేదు. గత ఐదేళ్లు పూర్తిగా నియోజకవర్గానికి పరిమితమై పోయారు. అప్పుడు సీఆర్డీయేపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆ ప్రాంతం ఆయన నియోజకవర్గంలో ఉన్నా కూడా తనకేం సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు.ఇక గత ఎన్నికల్లో ఓడిపోయాక కూడా పార్టీ నేతలను ఎందరినో ప్రభుత్వం, అధికార పార్టీ టార్గెట్ చేసినా ధూళిపాళ్ల నరేంద్ర మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉన్నారు. ఎప్పుడు అయితే సంగం డెయిరీ విషయంలో అక్రమాలు జరిగాయని నరేంద్రను ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు ఒత్తిడి చేసి మరీ టార్గెట్ చేశారో అప్పటి నుంచి ధూళిపాళ్ల నరేంద్రలో మార్పు మొదలైంది. నరేంద్ర ఈ కేసులో జైలులో కూడా ఉండి వచ్చారు. నరేంద్ర బయటకు వచ్చాక చాలా దూకుడుగా వెళుతున్నారు. గుంటూరు జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. రమ్య హత్య విషయంలో మిగిలిన టీడీపీ నేతల కంటే ముందే ఆయన స్పందించి అక్కడకు చేరుకుని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.ఇక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమూల్ డెయిరీని తీసుకు వస్తుంటే దానికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఏ మాత్రం స్కోప్ ఇవ్వకూడదని ధూళిపాళ్ల నరేంద్ర పట్టుదలతో ఫైట్ చేస్తున్నారు. ముఖ్యంగా సంగం డెయిరీ బ్రాంచ్‌లు విపరీతంగా పెంచుకుంటూ పోవడంతో పాటు డెయిరీ బిజినెస్ విస్తరిస్తున్నారు. ఇక గోదావరి జిల్లాల్లో కూడా సంగం డెయిరీ బిజినెస్ స్టార్ట్ చేస్తూ అమూల్‌కు పోటీగా దూకుడుగానే ముందుకు వెళుతున్నారు. మరోవైపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అమూల్‌కు పోటీగా సంగం డెయిరీ కార్యకలాపాలు విస్తృతంగా ప్రారంభమయ్యాయి.ధూళిపాళ్ల నరేంద్ర అమూల్‌కు షాక్ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ సంగం డెయిరీ బిజినెస్ విస్తరిస్తున్నారు. అటు రాజకీయంగా టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా ముందే తాను ఉన్నానంటూ బయటకు వస్తున్నారు. ఇటు సాధారణ ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా బయటకు వచ్చి మరీ విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా అరెస్టుకు ముందు వరకు తనకేం పట్టనట్టుగా ఉన్న ధూళిపాళ్ల నరేంద్రలో ఇప్పుడు వచ్చిన మార్పు గుంటూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా ధూళిపాళ్ల నరేంద్రలో కసి పెరిగిందన్నది వాస్తవం