కరీంనగర్, సెప్టెంబర్ 9,
హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా చిన్నది . దానిని పట్టించుకోవాల్సిన పనిలేదు’ అంటూ తెలంగాణ రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పేశారు. లైట్ తీసుకుందామంటూ గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటించారు. పార్టీ అధినేత మొదలు ప్రభుత్వ యంత్రాంగం వరకూ హుజూరాబాద్ ను దృష్టిలో పెట్టుకునే సతమతమవుతోంది. కేసీఆర్ కొత్త పథకాలను రూపకల్పన చేశారు. ఆర్థికమంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్ దాదాపు అక్కడే మకాం వేస్తున్నారు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా మాట్టాడుతున్నారు. నిజంగా టీఆర్ఎస్ అంత సీరియస్ గా లేకపోతే అంత గట్టి ప్రయత్నం ఎందుకు చేస్తోంది?. మొత్తం పార్టీ దృష్టి అంతా అక్కడే కేంద్రీకృతమైంది. ఫలితం కిందా మీదులైతే శ్రేణుల్లో నిస్సత్తువ ఆవరిస్తుంది. అందుకే దానిపై ఫోకస్ తగ్గించేందుకు లాజికల్ గానే కేటీఆర్ పార్టీని సమాయత్తం చేస్తున్నారు. పదవుల పంపిణీ, పార్టీ కమిటీల ఏర్పాటు, నియోజకవర్గాల వారీ ప్రణాళికలపై టీఆర్ఎస్ క్యాడర్ దృష్టి మరల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.హుజూరాబాద్ పై పార్టీ చాలా నమ్మకం పెట్టుకుంది. అయితే ఈటల ను కచ్చితంగా ఓడించగలమన్న విశ్వాసం అధినాయకత్వంలో ఇంకా ఏర్పడటం లేదు. కులాలు, వర్గాల వారీగా రాజేందర్ అనుచరులను టీఆర్ఎస్ లోకి లాగేశారు. కొందరికి పదవులు, మరికొందరికి బారీ హామీలు గుప్పించి స్థానికంగా టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కసరత్తు చేశారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాజేందర్ ను ఒంటరి చేయాలనేది అధికార పార్టీ ఎత్తుగడ. చోటామోటా నాయకులు, నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ ఈటలకు దూరమైపోయారు. కానీ విచిత్రంగా ప్రజల్లో బలమైన పట్టు ఉండటంతో నియోజకవర్గాన్ని మొత్తం పర్యటిస్తూ ప్రజలను సమీకరించడంలో ఆయన సక్సెస్ అవుతున్నట్లు టీఆర్ఎస్ గుర్తించింది. పార్టీలో చేరిన నాయకులు అధినాయకత్వం వద్ద తాము పార్టీని గెలిపిస్తామని చెబుతున్నారు. కానీ నియోజకవర్గంలో ప్రజల్లో పర్యటించడం లేదు. ఈ లోపాన్ని టీఆర్ఎస్ గుర్తించింది. హరీశ్ నాయకత్వంలో నియోజకవర్గం లో నాయకుల పనితీరుపై సమీక్షలు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రాజేందర్ కే నియోజకవర్గంలో ఆధిక్యం ఉందనే అనధికార సర్వే అంచనాలు అధికార పార్టీని బెంబేలెత్తిస్తున్నాయి.ఈటల రాజేందర్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన తర్వాతనే అతనిపై చర్యలకు కేసీఆర్ పూనుకున్నారు. రాజేందర్ ప్రత్యేక పార్టీని పెట్టుకుని ప్రజల్లోకి వెళతారని భావించారు. లేదంటే అందరి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా నిలుస్తారని అంచనా వేశారు. అయితే భారతీయ జనతాపార్టీని ఆశ్రయించడంతో టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. అతనిపై తొలి దశలో కేసుల విషయంలో చూపిన హడావిడి సద్దుమణిగిపోయింది. దాంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. కేవలం రాజకీయ కక్షతోనే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం కేసులను మోపిందనే వాదన బలం పుంజుకుంది. బీజేపీ రంగంలోకి దిగడంతో తటస్థమైపోయిందనే భావన కూడా నెలకొంది. దీనిని ఈటల అనుచరులు హుజూరాబాద్ లో బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం శక్తియుక్తులన్నీ కేంద్రీకరించినప్పటికీ కచ్చితమైన ఫలితం వస్తుందనే భరోసా లభించడం లేదు. అందుకే చేయాల్సిన పనిని చేస్తూనే రాజకీయంగా ఫలితం ఏదైనా తీవ్రమైన నష్టం వాటిల్లకుండా డామేజీ కంట్రోల్ చర్యలకు ముందస్తుగానే టీఆర్ఎస్ సిద్దమవుతోంది.రాజేందర్ రూపంలో బారతీయ జనతాపార్టీయే కాకుండా కాంగ్రెసు పార్టీ కూడా బలమైన అభ్యర్థినే హుజూరాబాద్ లో రంగంలోకి దింపాలని చూస్తోంది. ఎస్పీ ఓట్టను గంపగుత్తగా తెచ్చుకుంటూ బీసీ ఓట్లలో మెజార్టీ షేర్ రాబట్టాలనేది అధికార పార్టీ ప్రయత్నం. కానీ అదంత సులభంగా సాధ్యమయ్యే విషయంగా కనిపించడం లేదు. యువతలో మంచి ఆదరణ ఉన్న ప్రవీణ్ కుమార్ బహుజనసమాజ్ పార్టీ తరఫున ఎవరినైనా నిలబెట్టవచ్చని ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అదే జరిగితే టీఆర్ఎస్ అభ్యర్థి ఓట్లకు గండి పడటం ఖాయం. అదే సమయంలో ఎస్సీల తర్వాత అత్యధికంగా జనాభా కలిగిన పద్మశాలి సామాజిక వర్గాన్ని కాంగ్రెసు పోటీలో నిలపవచ్చనేది తాజా సమాచారం. అది కూడా టీఆర్ఎస్ ఆశలకు చిల్లు పెడుతుంది. కులాల సమీకరణతో ఈజీగా గట్టెక్కాలనుకున్న టీఆర్ఎస్ కు ప్రత్యర్థుల కులసమీకరణ ఇబ్బందులు కలిగిస్తోంది. ఢిల్లీ పార్టీలు రాజకీయంగా సిల్లీ పనులు చేస్తున్నాయంటూ కేటీఆర్ పేర్కొంటున్నారు. కానీ ఢిల్లీ పార్టీలు హుజూరాబాద్ లో పక్కా ప్లాన్ తో అధికారపార్టీ ఆశలపై నీళ్లు చిమ్మేందుకు సిద్దమవుతున్నాయి.