YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

పాత ఫీజులతోనే ఈ ఏడాది...

పాత ఫీజులతోనే ఈ ఏడాది...

హైదరాబాద్, సెప్టెంబర్ 9, 
ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ట్యూషన్‌ఫీజు మాత్రమే వసూలు చేయాలని కోరింది. ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన  సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాలతో ఈనెల ఒకటి నుంచి గురుకులాలు, వసతి గృహాలు మినహా అన్ని విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన విషయం తెలిసిందే. శానిటైజేషన్‌పై విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేకంగా ఒక పీరియెడ్‌ ఉండాలని మార్గదర్శకాల్లో కోరారు. ఎవరికైనా కోవిడ్‌ నిర్ధారణ అయితే వారితో కాంటాక్టులో ఉన్న వారికి వెంటనే పరీక్షలు చేయించాలని సూచించారు. కోవిడ్‌ బారిన పడి తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలను ఏ కారణం చేతనైనా ప్రయివేటు స్కూళ్ల యాజమాన్యాలు తొలగించకూడదని ఆదేశించారు. విద్యార్థులు ఇంటివద్దే ఉండి చదువుకుంటామంటే అనుమతించాలనీ, ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా పాఠాలు బోధించాలని తెలిపారు. పాఠశాలలకు హాజరు కావాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి తేవొద్దని సూచించారు. ప్రత్యక్ష తరగతులకు విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని కోరారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ మాస్క్‌లు ధరించాలని ఆదేశించారు. తరచుగా చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలనీ, శానిటైజర్‌ వినియోగించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పాఠశాల ఆవరణలో ఉమ్మివేయడం నిషేధమని పేర్కొన్నారు. వెనుకబడిన విద్యార్థులను ప్రిన్సిపాళ్లు గుర్తించి వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కోరారు.అవసరమైతే బ్రిడ్జి కోర్సును నిర్వహించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు. పిల్లలను పాఠశాలలకు పంపించకపోతే తల్లిదండ్రులు, విద్యార్థులపై జరిమానా విధించకూడదని వివరించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ పాఠశాలల్లో అసెంబ్లీ, గ్రూప్‌ డిస్కషన్లు, క్రీడలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం సమయంలో వంటగదిని క్షుణ్నంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పోషకాలు నిండిన ఆహారం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.వంటగది, డైనింగ్‌ హాల్‌, తాగునీరు వంటి ప్రదేశాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలని తెలిపారు. విద్యార్థులు పాఠశాలల్లోకి ప్రవేశం, వెళ్లే సమయాల్లో భౌతిక దూరం పాటించాలని సూచించారు. రవాణా సమయంలోనూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థికీ పాఠ్యపుస్తకాలు అందించాలని తెలిపారు. పెన్సిల్‌, పెన్ను, పుస్తకాలు, భోజనం, వాటర్‌ బాటిల్‌, గ్లాసులు, ప్లేట్లు ఇలా విద్యార్థుల వస్తువులు ఏవీ ఒకరివి ఇంకొకరు తీసుకోకుండా చూడాలని పేర్కొన్నారు.

Related Posts