తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి
తిరుమల, సెప్టెంబర్ 09
ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో స్వామివారి ఉత్సవర్లకు వేదోక్తంగా తిరుమంజనం, మూలవర్లకు ప్రోక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుందన్నారు. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారని చెప్పారు. ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహిస్తోందని తెలిపారు. వరాహజయంతిని పురప్కరించుకొని స్వామివారి ఉత్సవర్లకు తిరుమంజనం నిర్వహించినట్లు, ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు, విజివో బాలిరెడ్డి, శ్రీవారి ఆలయ ఒఎస్డీ పాల శేషాద్రి పాల్గొన్నారు.