విశాఖపట్టణం, సెప్టెంబర్ 11,
గురువు చూపిన బాటే శిష్యుడికి శిరోధార్యం. ఎక్కడైనా జ్ఞానం అందించి వెలుగు దారి చూపే వాడే గురువు. ఆ మాటకు వస్తే విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావుకు గురువు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. గంటా చలువతోనే అసెంబ్లీ ముఖం చూసిన అవంతి, ఆ తరువాత పార్లమెంట్ గేట్ దాటి కూడా ఎంపీ సీటులో కూర్చున్నారు. ఇక 2019 ఎన్నికల వేళ అదే గురువుతో పొసగక వైసీపీలో చేరి భీమిలీ నుంచి పోటీ చేసి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే మంత్రి కుర్చీ కూడా పట్టేశారు. ఇప్పటిదాకా కధ బాగా నడిచింది ఆ తరువాతనే రివర్స్ అయింది మరి.మంత్రిగా గంటా శ్రీనివాసరావు బాగానే హవా చాటుకున్నారు. ఆయన చుట్టూ అధికార యంత్రాంగాన్ని తిప్పుకున్నారు. నాటి సీఎం చంద్రబాబు తలలో నాలుకలా ఉండేవారు. విశాఖ అర్బన్ జిల్లా వరకూ నాటి సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా వేలూ కాలూ పెట్టరాదని చంద్రబాబు ద్వారా శాసనం చేయించి మరీ దర్జా చలాయించారు. ఇక శిష్యుడు అవంతి మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. ఆయన పేరుకు మంత్రి మాత్రమే అయ్యారు. కలెక్టర్ కాదు కదా ఆఖరుకు జీవీఎంసీ కమిషనర్ కూ డా మంత్రి మాట వినే పరిస్థితి లేదు. ఆ సంగతి ఈ మధ్యనే ఆయన సాటి కార్పోరేటర్లతో చెప్పుకుని తెగ బాధపడ్డారు. అంటే ఉత్సవ విగ్రహంగానే రెండున్నరేళ్ల కాలం నెట్టుకువచ్చారన్నమాట. ఇపుడు ఆ పదవి కూడా పోతోంది. తొందరలోనే గంటా శ్రీనివాసరావు పక్కన చేరి మాజీ మంత్రి అనిపించుకుంటారు అన్న మాట. 2018 వేళ భీమిలీ సీటు కోసం అంటు గంటా శ్రీనివాసరావు ఇటు అవంతి శ్రీనివాసరావు పోటీ పడ్డారు. టీడీపీలో చంద్రబాబు వీరిద్దరికీ సర్దిచెప్పలేక తల పట్టుకున్నారు. ఇక అక్కడ జరిగేది లేదు అని తెలుసుకుని అవంతి వైసీపీ నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి అదే భీమిలీ నుంచి అవంతి కి టికెట్ గల్లంతు అన్న మాట వైసీపీలో వినిపిస్తోంది. ఆయన జగన్ ఊపులోనే 2019 ఎన్నికల్లో కేవలం తొమ్మిది వేల బొటాబొటీ మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ టీడీపీ అక్కడ బాగానే బలం పుంజుకుంది. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అవంతికి మళ్లీ టికెట్ ఇచ్చినా భీమిలీలో ఓడిపోతారు అన్న అంచనాలు ఏవో అధినాయకత్వం వద్ద ఉన్నాయట. దాంతో భీమిలీకి అవంతిని దూరం పెడతారు అంటున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు పరిస్థితి కూడా టీడీపీలో అలాగే ఉంది. ఆయనకు కూడా భీమిలీ టికెట్ ఇచ్చేది లేదు అని ఇప్పటికే టీడీపీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చేసింది.ఇక గంటా శ్రీనివాసరావు టీడీపీ మాట విని దారికి వస్తే ఆయన్ని విశాఖ ఎంపీగా పోటీ చేయిస్తారు అంటున్నారు. అదే తీరున ఇపుడు అవంతి శ్రీనివాసరావు విషయంలోనూ వినిపిస్తున్న మాట. ఆయన్ని విశాఖ నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ ఎంపీగా బరిలోకి దింపుతారు అంటున్నారు. అంటే మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయ్యే యోగం గురు శిష్యులు ఇద్దరికీ లేదని వారి వారి పార్టీ పెద్దలు తేల్చేస్తున్నారు అన్న మాట. మొత్తానికి గురు శిష్యుల జాతకాలు రెండూ ఒకే దారిలో సాగుతూండడం విశేష పరిణామమే. ఇద్దరూ ఇపుడు మెట్టు దిగే ఉన్నారు కాబట్టి బెట్టు కూడా సడలించుకుంటే మరో కొత్త దారి ఏదైనా కనిపిస్తుందేమో కలసి వెతికితే బెటర్ అంటున్నారు అనుచరులు.