ఏలూరు,సెప్టెంబర్ 11,
అవి రుచిలో రారాజు ధరలోనూ రారాజే. అది సంవత్సరకాలంలో ఒక్కసారి మాత్రమే దొరికే అరుదైన చేప. ఇది ఒక్క గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరకే పులస చేపల ప్రత్యేకత. గోదావరి జిల్లాల్లో వాడుకలో ఉన్న నానుడి ఏటంటే 'పుస్తెలు అమ్మి అయినా పులస కూర తినాలట' అని అంటుంటారు. ఇక వినడానికి మరీ ఎక్కువగా అనిపించినా పులస చేపలకున్న ప్రాధాన్యం అలాంటిది మరి.. అది పశ్చిమగోదావరి జిల్లా. జిల్లాలో పెనుగొండ మండలం సిద్దాంతం అనే గ్రామం ఒకటి. అక్కడికి సమీపంలోని వశిష్ఠ గోదావరి బ్రిడ్జి దగ్గర పులస చేపల విక్రయాలు జోరుగా కొనసాగుతాయి. ఈ నోరూరించే పులస చేపలు ఉభయగోదావరి జిల్లాలో తప్ప రాష్ట్రంలో మరీ ఎక్కడా దొరకవు. ఇప్పుడు గోదావరిలోకి ఎర్ర నీరు రావడంతో పులస చేపలు సందడి చేస్తున్నాయి. దీంతో జాలర్లు పులస చేపల వేటలో పడి బిజీ అయ్యారు. ఒక్క పులస చేప ఖరీదు దాదాపు వెయ్యి రూపాయల నుండి ఐదు వేల రూపాయలు పలుకుతోంది. ఇంత ధర ఎందుకంటే వెండి రంగులో ఉండే ఈచేప రుచి అంతాఇంతాకాదండోయ్. అంతేకాదు ఈచేప సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దొరికే అరుదైన చేప. అందుకే జనాలు ఎంత ధరైనా సరే వెనుకాడకుండా కొనుగోలు చేసి లొట్టలేసుకుని మరీ తింటారు. చెప్పాలంటే పులస చేపల ఆశ చూపితే సచివాలయంలోని ఫైల్స్ కూడా ఇట్టే కదులుతాయట. ఇక హిల్సా ఇలిషా పులస చేప శాస్త్రీయనామం. ఆరోహవలస జాతికి చెందిన పులస, ఇలాసగా జీవనం సాగిస్తుంది. సంతాన ఉత్పత్తి కోసం హిందూమహాసముద్రం నుండి బంగాళఖాతం చేరుకుని అక్కడి నుంచి సుదీర్ఘంగా ఈదుతూ గోదావరిలోకి వలసలుగా వస్తాయి. అయితే పులస చేపల పులుసు చేయడం కూడా అంతసులువు కాదంటున్నారు ఉభయగోదావరి జిల్లా వాసులు. పిడకల పొయ్యి మీద వెన్నరాసిన కుండలో వండిన కూర తింటే ఆరుచే వేరంటున్నారు.