YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సోముతో కమల కలవరం

సోముతో కమల కలవరం

కాకినాడ, సెప్టెంబర్ 11, 
ఏపీలో శాపగ్రస్థ పాలన సాగుతోంది అని బీజేపీ పెద్ద సోము వీర్రాజు బాగానే అంటున్నారు. ఆయన సుదీర్ఘమైన లేఖ ఒకటి ముఖ్యమంత్రి జగన్ కి రాసి అందులో అప్పుల కుప్ప ఏపీని తయారు చేశారు అంటూ బండలు వేశారు కూడా. ఏపీకి గతి గత్యంతరం లేకుండా చేశారని నిప్పులు చెరిగారు. ఏపీని ఏం చేద్దామనుకుంటున్నారు అంటూ గద్దించారు. మరి బాధ్యత గల ప్రతిపక్షంగా సోము వీర్రాజుకు ఈ మాత్రం ఆవేశం ఉండడం సహజం. ఆయన నిలదీయాలనుకోవడం సమంజసమే. కానీ ఈ ప్రశ్నలు అడిగే ముందు కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉందన్న సంగతిని సోము వీర్రాజు మరచారా అన్నదే ప్రశ్న.మాటకు వస్తే చాలు ఏపీకి ఎంతో చేశామని బీజేపీ నాయకులు డప్పాలు కొడతారు. కానీ అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే ఏపీకి ఇస్తున్నారు. అంతే తప్ప ఏపీకి ప్రత్యేకమైన ప్రేమతో ఏమైనా ఇచ్చారా అన్నది జనం అడుగుతున్న ప్రశ్న. ఇక ఏపీని అడ్డగోలుగా విభజించిన నాడు ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పిన మోడీ ఇపుడు ఏపీ ఊసు మరచిన సంగతి సోము వీర్రాజు కు గుర్తు లేదా అన్నదే పెద్ద డౌట్. ఏపీకి 2014లోనే అతి పెద్ద రెవిన్యూ లోటు ఉందని ఆయనకు తెలియదా. ఇక తాము పొత్తు పెట్టుకుని నాలుగేళ్ల పాటు చెట్టాపట్టాలు వేసిన తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మూడు లక్షల కోట్ల అప్పులు గురించి ఆయన ఏనాడైనా ఇలా బాధ పడ్డారా అని కూడా అడిగితే ఏం జవాబు చెబుతారు.ఇల్లు కాలి ఒకడు ఏడుస్తూంటే మరొకడు చలి కాచుకున్నారని ముతక సామెత. ఇపుడు బీజేపీ సహా విపక్షాల తీరు అలాగే ఉంది. గల్లీలో గోల పెట్టడం, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పట్టుకుని విమర్శలు చేయడం తప్ప తమ సొంత రాష్ట్రం మీద ప్రేమ ఏ కాస్త అయినా ఉంటే దెబ్బ ఎక్కడ ఉందో అక్కడే కదా మందు వేయాలి అన్నది తెలియకపోవడమే విషాదం అంటున్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది. సోము వీర్రాజు సహా విపక్ష నేతలు అంతా ఏపీకి చెందిన వారు. ఏ కాస్తా సాయం అయినా ఏపీకి రప్పించి తెప్పిస్తే జనాలకు అది ఊరట. బీజేపీకి అది పొలిటికల్ గా మేలు చేస్తుంది. అంతే తప్ప పెద్ద మాస్టర్ లా బెత్తం పట్టుకుని ఏపీని శాపగ్రస్థ చేశారు అంటూ జగన్ని నిందించి ఏం ప్రయోజనం అంటున్నారు సగటు జనం.ఏపీకి ఈ దుస్థితి అంతా కలసి చేస్తేనే వచ్చిందని జనాలు అంటున్నారు. విభజన ఏపీ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటాలు. మలి ముఖ్యమంత్రి జగన్ అలవి కాని హామీలు, కేంద్రం ఉదాశీనత. ఢిల్లీ పెద్దలను ఎదిరించలేని ఏపీ రాజకీయ నేతల బలహీనత కలసి ఈ పరిస్థితిని తెచ్చాయని అంటున్నారు. చిత్రమేంటి అంటే ఇప్పటికైనా అంతా ఒక్కటి కాకపోవడం. ఏపీని ఆర్ధిక కష్టాల నుంచి బయట పడేయడానికి నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వకపోవడమే బాధాకరం. ఇదే తీరున సాగితే మునుముందు ఏపీ ఇంకా దిగజారుతుందే తప్ప మరేమీ కాదు. ఇక మూడవ సారి ఎవరు అధికారంలోకి వచ్చినా కూర్చునేందుకు కుర్చీ కూడా ఉండదు అన్నది ఆర్ధిక పాఠం చెబుతున్న కఠోర సత్యం. ఇప్పటికైనా సోము వీర్రాజు లాంటి వారు జగన్ కి ప్రేమ లేఖలు రాయడం ఆపేసి ఢిల్లీ పెద్దలను కలసి ఏపీ కష్టాలు ఏకరువు పెడితే ఆయనకూ పార్టీకి మేలు అంటున్నారు అంతా.

Related Posts