బెంగళూర్, సెప్టెంబర్ 11,
కర్ణాటక రాజకీయం ఎప్పుడూ హీట్ గానే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంతో మరింత అసంతృప్తి పెరగనుంది. యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి బసవరాజు బొమ్మైను సీఎంగా చేసినా అసమ్మతులు మాత్రం చల్లార లేదు. కొందరు నేతలు పార్టీ అధినాయకత్వం పట్ల గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు యడ్యూరప్ప కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన మరోసారి తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
యడ్యూరప్ప ఆషామాషీ నేత కాదు. వయసు ను అడ్డం పెట్టి ఆయనను పదవి నుంచి అధినాయకత్వం తొలిగించి ఉండవచ్చు. కానీ ఆయనలో పస తగ్గిపోలేదు. వేడి చల్లార లేదు. తనను అకారణంగా పదవి నుంచి దించేశారన్న ఆవేదనలో యడ్యూరప్ప ఉన్నారు. పూర్తి కాలం ముఖ్యమంత్రిగా తనను ఉంచి ఉంటే ఎలాంటి చర్యలకు యడ్యూరప్ప దిగి ఉండేవారు కాదు. కానీ ఆయనను గవర్నర్ గా పంపాలని పార్టీ అధినాయకత్వం భావిస్తుండటమే మరింత ఆగ్రహాన్ని తెప్పించిందంటున్నారు.దీనికి తోడు యడ్యూరప్ప చెప్పిన వారికి కూడా మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. తన కుమారుడికి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. దీంతో యడ్యూరప్ప ఎన్నికలకు ముందు పార్టీ అధినాయకత్వంపై తిరగబడే అవకాశముందని చెబుతున్నారు. యడ్యూరప్ప త్వరలోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయలుదేరనున్నారు. పార్టీ శ్రేణులను, తన మద్దతుదారులను మరింత దగ్గర చేసుకునేందుకే యడ్యూరప్ప ఈ యాత్ర చేపడతారని తెలుస్తోంది.యడ్యూరప్పకు ఇప్పటికీ కర్ణాటకలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. అదే సామాజికవర్గానికి చెందిన బసవరాజు బొమ్మైకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆ సామాజికవర్గం మాత్రం యడ్డీ వెంటనే ఉందటున్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం యడ్యూరప్ప కొత్త పాచిక వేస్తారన్నది ఇప్పుడు బీజేపీ వర్గాల నుంచి విన్పిస్తున్న టాక్. మొత్తం మీద యడ్యూరప్పను పక్కకు తప్పించినా ఆయన మాత్రం భవిష్యత్ లో పార్టీకి తలనొప్పిగా మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు.