నిజామాబాద్, సెప్టెంబర్ 11,
ఎన్ఆర్ఐలు కేవలం పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారు. పదవి దక్కకుంటే మళ్లీ వ్యాపారాల్లోకి వెళ్లిపోతారు. ఎన్నో ఉదాహరణలు కంటిముందే కనపడుతున్నా ప్రజలు కూడా ఎన్ఆర్ఐ లు పోటీ చేయగానే మద్దతిస్తున్నారు. కొందరు ఓటమి పాలు కాగా, మరికొందరు విజయం సాధిస్తున్నారు. అయితే ఓడిపోయిన ఎన్ఆర్ఐలు ఇక నియోజకవర్గం ముఖం కూడా చూడరు. వెనువెంటనే విమానం ఎక్కేసి విదేశాలకు చెక్కేస్తున్నారు. అలాంటి నేతల్లో కాంగ్రెస్ నేత మధు యాష్కి ఒకరు.మధు యాష్కి కేవలం ఎన్నికలకు ముందే కనపడతారు. రెండుసార్లు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా మధు యాష్కి గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన వరసగా విజయం సాధించడంతో ఇక కళ్లు నెత్తికెక్కాయంటారు. ఆ విజయం తన వ్యక్తిగతమేనని భ్రమించిన మధు యాష్కి అదే తరహాలో రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఇక 2014 ఎన్నికల నుంచి వరస అపజయాలను మధు యాష్కి మూటగట్టుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే మధు యాష్కి జాతకం తిరగబడిందనే చెప్పాలి.నిజానికి మధు యాష్కి అమెరికాలో వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. యాష్కి కుటుంబం కూడా అక్కడే ఉంటుంది. 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవితపై ఓటమి పాలయినప్పుడు మళ్లీ నియోజకవర్గం మొహం చూడలేదు. తిరిగి 2019 ఎన్నికలకు ముందు మధు యాష్కి వచ్చారు. ఒకరకంగా ఈయన స్థానికేతురుడన్న ముద్ర నిజామాబాద్ లో బలంగా పడింది. నియోజకవర్గంలో సమస్యలపై కూడా ఆయన స్పందించడం లేదు.మధు యాష్కి రెండు సార్లు ఎంపీగా గెలవగానే తాను జాతీయ స్థాయి నేత అని భ్రమించారు. రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కూడా కొంత కలసి వచ్చింది. ఏఐసీసీలో పదవి దక్కడంతో తెలంగాణ కాంగ్రెస్ మధు యాష్కికి చాలా చిన్నదిగా కన్పించింది. అందుకే మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత మధుయాష్కి మళ్లీ మాయమై పోయారంటారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మధు యాష్కీ వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఈ విజిటింగ్ పొలిటీషియన్ మళ్లీ ఎన్నికల ముందు వచ్చి పార్టీలో హల్ చల్ చేస్తారన్న కామెంట్స్ గాంధీ భవన్ లోనే విన్పిస్తున్నాయి.